క్రీడల్లో పరస్పర సహకారం.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ రోడ్‌‌మ్యాప్ ఆవిష్కరణ

by Harish |

భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రీడా బంధం మరింత బలోపేతం కానుంది.

క్రీడల్లో పరస్పర సహకారం.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ రోడ్‌‌మ్యాప్ ఆవిష్కరణ
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రీడా బంధం మరింత బలోపేతం కానుంది. ఇరు దేశాలు క్రీడల్లో పరస్పర సహకారం కోసం భారత్- ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబిరేషన్ రోడ్ మ్యాప్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాన అల్బనీస్ ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోడీ శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ..‘భారత్ 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్స్ జరగనున్నాయి. ప్రపంచ స్థాయి ఈవెంట్లను నిర్వహించడానికి భారీ స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధానికి క్రీడలు బలమైన స్తంభం. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబిరేషన్ రోడ్‌మ్యాప్‌ను ప్రధానమంత్రి అల్బనీస్‌తో కలిసి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా మనం క్రికెట్‌లోనే కాకుండా ఇతర క్రీడల్లోనూ సహకారాన్ని బలోపేతం చేస్తాం. ’అని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం భారత్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియా బిడ్‌కు తాము మద్దతు ప్రకటిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ప్రకటించారు. దీంతో ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల విషయంలో భారత్‌కు భారీ మద్దతు లభించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ రోడ్ మ్యాప్ ఇరు దేశాల మధ్య క్రీడా శిక్షణ, మౌలిక వసతుల కల్పన, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ, పెట్టుబడుల్లో సహకారం ఇచ్చిపుచ్చుకుంటాయి. పరస్పర ఆసక్తి ఉన్న క్రీడలను ప్రోత్సహించడానికి ఇరు దేశాల్లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు, యూత్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో కబడ్డీ, ఖ ఖో, ఇండియాలో ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లీగ్, బాస్కెట్‌బాల్ నిర్వహించడం. అలాగే, మహిళల అథ్లెట్ల కోసం ద్వైపాక్షిక టోర్నమెంట్‌లు నిర్వహించడం, వారి ఆరోగ్యం, శిక్షణ, క్రీడల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇరు దేశాలు కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.

చెన్నయ్‌లో బీబీఎల్ ఓపెనింగ్ మ్యాచ్

రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. బీబీఎల్ 2026-27 సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌కు ఇండియా ఆతిథ్యమివ్వనుంది. ఈ గేము చెన్నయ్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. డిసెంబర్ 12న జరిగే ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తలపడనున్నాయి. ఓ విదేశీ టీ20 లీగ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. అలాగే, బీబీఎల్ లీగ్ మరో దేశంలో నిర్వహించడం కూడా ఇదే మొదటిసారి. ‘బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌ను చెన్నయ్‌లో నిర్వహించడం సంతోషంగా ఉంది. భారత్‌లో ఏ క్రీడా లీగ్‌కైనా ఆదరణ ఉంటుంది. వ్యూయర్‌షిప్ కూడా బాగా ఉంటుంది.’అని ప్రధాని మోడీ తెలిపారు.


Next Story