ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

by velandi.Saikiran |

చల్లూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ, వీణవంక: మండలంలోని చల్లూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత కారణంగా రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదని దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే కౌశిక్ రెడ్డి ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రికి మొత్తం 12 మంది సిబ్బంది మంజూరు కాగా అందులో ఆరుగురు డిప్యూటేషన్ పై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారని ప్రస్తుతం ఒక్క వైద్యుడుతోనే ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతుందని వెల్ల‌డించారు. దీంతో ప్రజలకు అవసరమైన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారితో ఫోన్లో మాట్లాడి డిప్యుటేషన్ పై వెళ్లిన సిబ్బందిని వెంటనే తిరిగి విధుల్లోకి రప్పించి ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వాల బాల కిషన్ రావు, మాజీ ఎంపీపీ రేణుకా తిరుపతిరెడ్డి, సర్పంచ్ రామిడి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story