ఆషాడ బోనాల ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : మంత్రి కొండా సురేఖ..

by Taduka Kalyani |

ఆషాడ బోనాల ఉత్సవాలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలను నిర్వహించి, రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.

ఆషాడ బోనాల ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : మంత్రి కొండా సురేఖ..
X

దిశ, కార్వాన్ : ఆషాడ బోనాల ఉత్సవాలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలను నిర్వహించి, రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం గోల్కొండ కోట ఆవరణలో అమ్మవారికి పూజలు నిర్వహించి బోనం సమర్పించిన అనంతరం, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆమె బోనాల ఏర్పాట్లపై సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చారిత్రాత్మక గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి (ఎల్లమ్మ తల్లి) ఆలయం నుండి ఈ నెల 16న తొలి బోనం ప్రారంభం కానుందని తెలిపారు. ఈ ఉత్సవాల కోసం సీఎం రూ. 20 కోట్ల నిధులను మంజూరు చేశారని వెల్లడించారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు ప్రతి ఆది, గురువారాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయని, 16న ఉదయం లంగర్ హౌస్ క్రాస్ రోడ్ నుండి గోల్కొండ కోట వరకు భారీ ఊరేగింపు నిర్వహించి, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తామని చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీకేడ్లు ఏర్పాటు చేయాలి. మహిళా భక్తుల రక్షణ కోసం మహిళా పోలీసులు, షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షించాలి. సీసీ కెమెరాలు, టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి.

విద్యుత్, జీహెచ్‌ఎంసీ: రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా నిరంతర సరఫరా అందించాలి, జనరేటర్లు సిద్ధంగా ఉంచాలి. ఉత్సవాలకు ముందే పారిశుధ్య పనులు పూర్తి చేసి, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలి, సురక్షిత క్యూలైన్లు నిర్మించాలి, మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, వైద్యాధికారులను అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, ఫైర్ ఇంజన్ల అప్రమత్తత, సమాచార శాఖ ద్వారా లైవ్ కవరేజ్, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ మాట్లాడుతూ.. గోల్కొండ బోనాలలో హిందూ ముస్లింలు భాయ్ భాయ్‌గా కలిసి పాల్గొంటారని పీస్ కమిటీ ప్రాధాన్యతను గుర్తుచేశారు. చిన్న ఆలయాలకు ఇచ్చే రూ. 5 వేల ఆర్థిక సాయం సరిపోవడం లేదని, దానిని రూ. 10 వేలకు పెంచేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు. అనంతరం వారు బోనాల జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్, డీసీపీలు కాజల్ సింగ్, రాఘవేందర్ రెడ్డి, ఈవో వసంత, ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఆలయ మాజీ చైర్మన్లు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Next Story