- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
నరసాపురం – బెంగళూరు (ఎస్‌ఎమ్‌వీబీ) రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్‌లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు..

దిశ, పాలకొల్లు: నరసాపురం – బెంగళూరు (ఎస్‌ఎమ్‌వీబీ) రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్‌లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన నరసాపురం–బెంగళూరు సర్వీసుకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. సగటున 100 శాతం పైగా ఆక్యుపెన్సీతో నడిచిన ఈ రైలును ప్రజల డిమాండ్ మేరకు రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించి, రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చేందుకు కృషి చేసి విజయవంతమయ్యామని తెలిపారు.
ఇకపై ఈ రైలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరి, శనివారం ఉదయం 9:45 గంటలకు బెంగళూరు (ఎస్‌ఎమ్‌వీబీ) చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి, ఆదివారం తెల్లవారుజామున 5:50 గంటలకు నరసాపురం చేరుకుంటుందని వివరించారు.ఈ రైలు ముఖ్యంగా వారాంతాల్లో బెంగళూరుకు రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నరసాపురం, పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తదితర స్టేషన్లలో ఆగడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు మార్గమధ్యంలోని ప్రాంతాలకు మెరుగైన రైల్వే అనుసంధానం లభిస్తుందని తెలిపారు. ప్రత్యేక రైలుతో పోలిస్తే రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌గా మారడంతో టికెట్ ధరలు దాదాపు 30 శాతం వరకు తగ్గనున్నాయని, అలాగే సమయపాలన, నిర్వహణ మరింతమెరుగుపడుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
నరసాపురం ప్రాంతానికి మరిన్ని కొత్త రైలు సర్వీసులను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.విజయవాడ–బెంగళూరు మధ్య త్వరలో ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం నుంచి ప్రారంభించేలా రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లానని, దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. నరసాపురం ప్రాంతం నుంచి ప్రతిరోజూ సుమారు 18 బస్సులు బెంగళూరుకు నడుస్తున్న నేపథ్యంలో వందే భారత్ సేవకు ఈ ప్రాంతానికి ఉన్న అవసరాన్ని ఉన్నతాధికాలకు తెలియ చెప్పానని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
అదేవిధంగా నరసాపురం నుంచి వారణాసి, విశాఖపట్నం వరకు పగటిపూట ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుల కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అవి కూడా త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అన్నారు.పాలకొల్లు, భీమవరం, ఆకివీడు రైల్వే స్టేషన్లలో రూ.20 కోట్ల వ్యయంతో రైల్వే గూడ్స్ షెడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే పాలకొల్లు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్ ఏర్పాటు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నాయుడు, డీఆర్‌యూసీసీ సభ్యులు జక్కంపూడి కుమార్, జనసేన నాయకులు బోనం చిన్నబాబు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కార్యకర్తలు, రైల్వే అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.






