- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయిలో సింగరేణి సత్తా.. చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక రేటింగ్‌లు
దేశీయ బొగ్గు గనుల రంగంలో సింగరేణి సంస్థ సరికొత్త రికార్డు సృష్టించింది.

- 5 గనులకు 5-స్టార్ రేటింగ్
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు
దిశ, తెలంగాణ బ్యూరో : దేశీయ బొగ్గు గనుల రంగంలో సింగరేణి సంస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రకటించే జాతీయ స్థాయి రేటింగుల్లో సింగరేణికి చెందిన 5 బొగ్గు గనులు అత్యుత్తమ ‘5-స్టార్’ రేటింగ్‌ను కైవసం చేసుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ జాబితాలో సింగరేణి చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 5 గనులు ఈ అత్యున్నత గుర్తింపు సాధించడం విశేషం. జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన సింగరేణి అధికారులు, కార్మికులకు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రేటింగ్ సాధించిన గనులు ఇవే..
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన మొత్తం 382 బొగ్గు గనులు ఈ రేటింగ్ కోసం పోటీపడగా.. కేవలం 50 గనులు మాత్రమే ‘5-స్టార్’ సాధించాయి. ఇందులో సింగరేణి నుంచే 5 గనులు ఉండటం గమనార్హం.
*శ్రీరాంపూర్ ఏరియా: ఆర్.కె న్యూటెక్, ఆర్.కె-6 గనులు
*సత్తుపల్లి ఏరియా: జె.వి.ఆర్ ఓసి-2 గని
*బెల్లంపల్లి ఏరియా: ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గని
*రామగుండం-3 ఏరియా: ఆర్.జి ఓసి-1 గని
50 అంశాల్లో కఠిన పరీక్ష..
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ) ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది. గనుల్లో మైనింగ్ విధానం, అధునాతన టెక్నాలజీ వినియోగం, ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం, రక్షణ-భద్రత ప్రమాణాలు, మైనింగ్ ప్రభావిత గ్రామాల అభివృద్ధి (సీఎస్ఆర్) వంటి 7 ప్రధాన విభాగాల్లోని 50 అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తొలుత కంపెనీలు సమర్పించిన స్వీయ మూల్యాంకన నివేదికలను పరిశీలించిన అనంతరం, నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష తనిఖీలు చేస్తుంది. ఈ కఠినమైన పరీక్షలో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన గనులకే 5-స్టార్ రేటింగ్ ఇస్తారు. ఇటీవలే నిపుణుల బృందం సింగరేణిలో జరిపిన తనిఖీల ఆధారంగా ఈ అవార్డులను ఖరారు చేసింది. మరోవైపు 80 నుండి 90 శాతం మార్కులు సాధించి కొద్దిపాటి తేడాతో 5-స్టార్ రేటింగ్ కోల్పోయిన మరో 17 సింగరేణి గనులకు 4-స్టార్ రేటింగ్ లభించింది. వీటికి ప్రత్యేక అవార్డులు లేనప్పటికీ, దాదాపు ఉత్తమ శ్రేణికి చేరువైన గనులుగా గుర్తింపు దక్కింది.
కార్మికులకు, అధికారులకు డిప్యూటీ సీఎం సెల్యూట్..
సింగరేణి గనుల ఘనతపై డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. డిసిప్లిన్, సేఫ్టీ, పర్యావరణ పరిరక్షణను పాటిస్తూ, రాష్ట్ర ఇంధన అవసరాలకు తగిన బొగ్గును ప్రమాద రహితంగా అందిస్తున్నందుకు సంస్థ యాజమాన్యాన్ని, అధికారులను, కార్మిక లోకాన్ని ఆయన అభినందించారు. గత ఏడాది 4 గనులకు 5-స్టార్ రాగా, ఈసారి ఆ సంఖ్య ఐదుకు చేరడం శుభపరిణామమన్నారు. మిగిలిన గనులు కూడా వీటిని ఆదర్శంగా తీసుకుని, రాబోయే రోజుల్లో మరిన్ని 5-స్టార్ రేటింగ్‌లు సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.






