- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 ఏళ్లుగా గూడు లేని బడి.. శాశ్వత భవనం కోసం ఎదురుచూపులు
బ్రహ్మంగారి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు శాశ్వత భవనం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు శాశ్వత భవనం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అద్దె భవనంలోని ఒకే గదిలో విద్యార్థులకు బోధన కొనసాగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “వర్షాకాలం వస్తే మా పిల్లల పరిస్థితి ఏంటి? ఒకే గదిలో ఎలా చదువుకుంటారు?” అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అద్దె భవనంలోనే మధ్యాహ్న భోజనం వండాల్సి రావడం, సరైన తరగతి గదులు లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.
గ్రామస్తుల కథనం ప్రకారం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పాఠశాల భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. గత ఏడాదే భవనం పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ పనులు పూర్తికాలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మౌలిక వసతులు లేని కారణంగా ఒకప్పుడు 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రస్తుతం కేవలం 12 మంది మాత్రమే చదువుకుంటున్నారని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సి వస్తోందని, ఇది ఆర్థికంగా భారంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శాశ్వత పాఠశాల భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






