9 మండలాల అధ్యక్షులే కొనసాగుతారు.. మార్పు లేదు

by Ratna Kumari |

తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే మందుల సామెల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

9 మండలాల అధ్యక్షులే కొనసాగుతారు.. మార్పు లేదు
X

దిశ, తుంగతుర్తి : తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే మందుల సామెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన తొమ్మిది మండలాల కాంగ్రెస్ అధ్యక్షులే కొనసాగుతారని, వారి నియామకాలలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. శుక్రవారం తుంగతుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షుడు రేగటి రవి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

"నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రకటించిన మండల అధ్యక్షుల్లో మార్పు ఉండదు. ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మండల అధ్యక్షుల ఎంపిక సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని జరిగిందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి కాంగ్రెస్ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న విభేదాలు సహజమేనని, వాటిని సరిదిద్దుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని కొత్తగా నియమితులైన అధ్యక్షులకు సూచించారు. నియోజకవర్గంలో కొత్త, పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి తిరిగి విజయపథంలో నడిపించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా అభివృద్ధి అంశాలపై స్పందించిన ఎమ్మెల్యే, ఎర్రపహాడ్ ప్రాంతంలో దొరల ఆధీనంలో ఉండి సాగులో ఉన్న సుమారు 3 వేల ఎకరాల భూములకు నూతనకల్, మద్దిరాల ప్రాంత రైతులకు త్వరలోనే పట్టాలు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియకు సహకరించిన శ్యాంసుందర్, సుధీర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో మరో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Next Story