- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: సెల్యూట్ చేసే కుడిచేతిపై టాటూలు ఉన్నాయన్న కారణంతో ప్రమోషన్ కు అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు చెందిన ఇద్దరు ఇన్ స్పెక్టర్లు ఫైర్ చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేసింది. పారా మిలటరీ దళాల్లో పాటించే క్రమశిక్షణ, నిబంధనలను కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. శస్త్ర చికిత్సతో టాటూలను తొలగించుకున్నప్పటికీ.. వారిద్దరికీ హైకోర్టు ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం శరీరంపై నిషేధిత ప్రాంతంలో టాటూ ఉండటం వల్ల వచ్చిన అనర్హతను.. పరీక్ష ముగిసిన తర్వాత తొలగించడం ద్వారా సరిచేయలేమని స్పష్టం చేసింది. జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. మెడికల్ గైడ్ లైన్స్ టాటూలపై పూర్తిగా నిషేధం విధించలేదంటూనే.. అవి ఎక్కడ, ఏ సైజులో ఉండాలన్న అంశాలను మాత్రమే నియంత్రిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. సెల్యూట్ చేసే కుడి చేతిపై (Right Forearm) టాటూలు ఉండటం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. దళాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి ఈ నియమాలు తెలియవని చెప్పడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది.
2010, 2012 సంవత్సరాల్లో కానిస్టేబుళ్లుగా చేరిన ఇద్దరు సిబ్బంది, వరుస ప్రమోషన్ల ద్వారా ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఆ సమయంలో ఈ టాటూలు వారికి ఎలాంటి అడ్డంకిగా మారలేదు. అయితే.. 2024లో అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్ డ్యూటీ) పోస్టుల ప్రమోషన్ల కోసం నిర్వహించిన రాత, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ.. వైద్య పరీక్షల్లో కుడిచేతిపై టాటూలు ఉండటంతో మెడికల్ బోర్డు వారిని అన్‌ఫిట్‌గా ప్రకటించింది. తాము ఇప్పటికే సర్జరీ ద్వారా టాటూలను తొలగించుకున్నామని, కాబట్టి తమకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. కానీ, అప్లికేషన్ సమర్పించే నాటికి, వైద్య పరీక్షల నాటికే అర్హతలను పరిగణనలోకి తీసుకుంటామని, ఆ తర్వాత మార్పులు చేస్తే కుదరదని కోర్టు తేల్చిచెప్పింది. అయితే, వీరు తదుపరి నోటిఫికేషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.






