పాడి రైతుల సంక్షేమానికి కృషి

by velandi.Saikiran |

మినీ డైరీ పథకానికి ఎంపికైన 12 మంది రైతులు గేదెలు కొనుగోలు చేసేందుకు భీమవరం వెళుతున్న సందర్భంగా శుక్రవారం ఐడిఓసి ఆవరణలో వాహనాన్ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.

పాడి రైతుల సంక్షేమానికి కృషి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అందులో భాగంగానే గేదెల కొనుగోలుకు సహకారం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన మినీ డైరీ పథకానికి ఎంపికైన 12 మంది రైతులు గేదెలు కొనుగోలు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళుతున్న సందర్భంగా శుక్రవారం ఐడిఓసి ఆవరణలో వాహనాన్ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు గేదెల కొనుగోలుకు రూ.2 లక్షలకు గాను 60 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని,మిగిలిన 40 శాతం బ్యాంకు లోన్ పొందడం జరుగుతుందన్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మంచి అధిక పాల ఉత్పత్తిని ఇచ్చే గేదెలు ఉండడంతో పాడి రైతులను అక్కడికి పంపిస్తున్నట్లు తెలిపారు.గేదెల కొనుగోలుకు సంబంధిత శాఖల పలువురు అధికారులు కూడా రైతుల వెంట అక్కడికి వెళ్లి సహకరిస్తారన్నారు. రైతులు కొనుగోలు చేసిన గేదెలు జాగ్రత్తగా వారి ఇంటికి చేరేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని నుషిత, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట్ నారాయణ,ఎల్డియం శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.


Next Story