ఎస్ఐఆర్ ప్రక్రియలో - ప్రతి ఓటరు సహకారం అవసరం

by Taduka Kalyani |   (  Updated:2026-07-10 12:56:05  IST  )

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి వీలైనంత త్వరగా సంబంధిత బూత్ స్థాయి అధికారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విజ్ఞప్తి చేశారు.

ఎస్ఐఆర్ ప్రక్రియలో - ప్రతి ఓటరు సహకారం అవసరం
X

దిశ,సంగారెడ్డి అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి వీలైనంత త్వరగా సంబంధిత బూత్ స్థాయి అధికారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఫారాల వివరాలను నిర్దేశిత గడువులోగా డిజిటలైజ్ చేయాల్సి ఉన్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ న్యూఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, అన్ని జిల్లా కలెక్టర్లతో ఎస్ఐఆర్ అమలు తీరుపై సమీక్షనిర్వహించారు.అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లాలోని ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేకంగా వీడియో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వాటి డిజిటలైజేషన్‌లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సహాయ ఎన్నికల నమోదు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పురోగతి చూపని అధికారులపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా తీసుకోరాదని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలని స్పష్టం చేశారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

గడువు సమీపిస్తున్న నేపథ్యంలో శని, ఆదివారాలు కూడా ప్రత్యేకంగా పనిచేసి వచ్చే సోమవారం నాటికి 50 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి బూత్ స్థాయి అధికారికి రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని, ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు పోలింగ్ కేంద్రం వారీగా ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి బూత్ స్థాయి అధికారులను పర్యవేక్షించాలని సూచించారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను ఆలస్యం చేయకుండా వెంటనే డిజిటలైజ్ చేసి రోజువారీ పురోగతి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.ఇతర సిబ్బంది సహకారం బూత్ స్థాయి అధికారులకు సహకారం అందించేలా గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీఉపాధ్యాయులుసమన్వయంతోపనిచేయాలని, ఓటర్లకు ఫారాలు పూరించడంలో సహాయం అందించాలని తెలిపారు. అదేవిధంగా బూత్ స్థాయి ప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ బూత్ స్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. ఓటర్లు పూరించిన ఫారాలను సకాలంలో బూత్ స్థాయి అధికారులకు అందేలా సమన్వయం చేయాలని కోరారు.ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత, నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమాహారతి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story