- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరెస్ట్ చేసినా.. చంపేసినా ఇక స్వదేశానికి వెళ్తా: షేక్ హసీనా సంచలన ప్రకటన
భారత్‍లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన స్వదేశానికి తిరిగి వెళ్లడంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు. తనను అరెస్ట్ చేసినా.. చంపేసినా సరే తాను ఈ ఏడాది డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్తానన్నారు. తనపై మరణశిక్ష పడినప్పటికీ, స్వదేశానికి తిరిగి వస్తే అరెస్ట్ లేదా ప్రాణాపాయం పొంచి ఉందని తెలిసినప్పటికీ తాను ఈ ఏడాది డిసెంబర్ నాటికి తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. 2024 ఆగస్టులో విద్యార్థుల భారీ ఉద్యమం కారణంగా ఆమె పదవిని కోల్పోయింది.ఆ తర్వాత తన దేశం నుంచి పారిపోయి వచ్చి ప్రస్తుతం ప్రస్తుతం భారత్‌లో ఆమె ఆశ్రయం పొందుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతు తన భవిష్యత్ ప్రణాళికలపై స్పందించారు.
అరెస్ట్ చేయవచ్చు లేదా చంపవచ్చు:
తనతో పాటు దేశం దాటి వెళ్లిన అవామీ లీగ్ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలందరూ స్వచ్ఛందంగా డిసెంబర్‌లో బంగ్లాదేశ్ చేరుకుంటామన్నారు. అక్కడ కోర్టుల ముందు లొంగిపోతామని హసీనా స్పష్టం చేశారు. ఈ తిరుగు ప్రయాణం గురించి ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపలేదని ఆమె తెలిపారు. నేను బంగ్లాదేశ్ అడుగుపెట్టగానే నన్ను అరెస్ట్ చేయవచ్చు లేదా చంపేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ నేను వెళ్లాల్సిందే. స్వదేశంలో నా పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. నాకు మరణమే వస్తే, అది నా తల్లిదండ్రులు సమాధి చేయబడిన, వారి రక్తం చిందిన నా సొంత గడ్డపైనే రావాలని కోరుకుంటున్నానన్నారు.
మరణశిక్ష విధిస్తూ ట్రిబ్యునల్ తీర్పు:
2024 లో జరిగిన విద్యార్థుల ఆందోళనల అణచివేతలో మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) షేక్ హసీనాకు గతంలో మరణశిక్ష విధించింది. ఆందోళనకారులపై కాల్పులు జరపాలని ఆదేశాలు ఇవ్వడం, మరణాలను అడ్డుకోలేకపోవడంలో ఆమెను కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా మరణశిక్ష పడగా, మాజీ ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్-మామున్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. వీటన్నింటితో పాటు షేక్ హసీనా, మాజీ హోంమంత్రి కమల్‌ల ఆస్తులను జప్తు చేయాలని కూడా ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాల మధ్య డిసెంబర్‌లో ఆమె తిరుగు ప్రయాణం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.






