గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్‌కు స్వపక్ష కౌన్సిలర్ల షాక్..!

by Kodari Anjali |

గుమ్మడిదల మున్సిపాలిటీలో అధికార బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమైనట్లు కనిపిస్తున్నాయి.

గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్‌కు స్వపక్ష కౌన్సిలర్ల షాక్..!
X

దిశ, జిన్నారం: గుమ్మడిదల మున్సిపాలిటీలో అధికార బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమైనట్లు కనిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశానికి ఏకంగా 9 మంది కౌన్సిలర్లు గైర్హాజరు కావడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో సమావేశం ఆశించిన స్థాయిలో కాకుండా సదాసీదాగా జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై విస్తృత చర్చ జరగాల్సి ఉండగా, సభ్యుల గైర్హాజరుతో ఆ అవకాశమే లేకుండా పోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, మున్సిపల్ ఛైర్మన్ కుమార్ గౌడ్ వ్యవహార శైలిపై అసంతృప్తితోనే కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, కౌన్సిలర్లకు చేసిన కమిట్‌మెంట్‌లను ఛైర్మన్ అమలు చేయలేదనే అసంతృప్తి వారిలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో అలిగిన కౌన్సిలర్లు పలువురు ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల దర్శనానికి టూర్ వెళ్లినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే సమావేశానికి దూరంగా ఉండడం చైర్మన్ కుమార్ గౌడ్‌కు స్వపక్షం నుంచే గట్టి ఝలక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం గుమ్మడిదల బీఆర్ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలకు నిదర్శనంగా మారిందనే చర్చ జరుగుతోంది. అయితే, కౌన్సిలర్ల గైర్హాజరుపై చైర్మన్ కుమార్ గౌడ్ లేదా మున్సిపల్ అధికారుల నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. రానున్న రోజుల్లో ఈ విభేదాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story