హైడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ

by Malleboina Mahesh |

హైడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా బస్తీవాసుల భారీ ర్యాలీ.. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు!

హైడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ
X

దిశ, వెబ్ డెస్క్:హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా దూసుకుపోతున్న ‘హైడ్రా’ (HYDRAA) చుట్టూ రాజకీయ, సామాజిక సెగలు మరింత రాజుకుంటున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎంఎస్ మక్తా (MS Maktha), బీఎస్ మక్తా (BS Maktha) బస్తీలకు చెందిన వేలాది మంది నివాసితులు శుక్రవారం రోడ్డుపైకి వచ్చి భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ‘హైడ్రాను రద్దు చేయాలి.. మా బస్తీలను కాపాడాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు.

కూల్చివేతల ప్రచారంతో ఆందోళన

హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ చారిత్రాత్మక బస్తీలను ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయనే నెపంతో హైడ్రా అధికారులు త్వరలోనే కూల్చివేస్తారనే ప్రచారాలు గత కొన్ని రోజులుగా స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న తమకు ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను తొలగిస్తే తాము రోడ్డున పడతామని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆగ్రహించిన మహిళలు, స్థానికులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా "సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్" అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పేదల పొట్ట కొట్టే హైడ్రాను తక్షణమే రద్దు చేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనతో ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Next Story