- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావుకు కాంగ్రెస్ ‘ఆఫర్’.. మహేష్ కుమార్ గౌడ్ ఓపెన్ స్టేట్‌మెంట్
బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా, పార్టీ అంతర్గత వ్యవహారాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా, పార్టీ అంతర్గత వ్యవహారాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావును టార్గెట్ చేస్తూ పీసీసీ చీఫ్ ఘాటు విమర్శలు గుప్పించారు. "హరీష్ రావు గారు.. పదేళ్లు మంత్రిగా ఉండి మీరు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ మూడు నెలల టైమ్ ఎందుకు ఇవ్వాలి? మీరు కట్టిన ప్రాజెక్టులు కుంగిపోయాయి. దానికి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి హరీష్ రావుకు మిట్ట మధ్యాహ్నమే చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో "హరీష్ రావు మా పార్టీలోకి వస్తానని చెబితే, మా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (PAC)లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అంటూ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ నిధులపై స్పందిస్తూ.. కవిత చేసిన ఆరోపణల్లో నిజం ఉందన్నారు. ఒక రీజినల్ పార్టీకి రూ.1,400 కోట్లు ఎలా జమ అయ్యాయో చెప్పాలని, దీనిపై ఖచ్చితంగా అనుమానాలు వస్తున్నాయని అన్నారు.
ఈటల రాజేందర్ ఆ రోజు ఏం చేశారు?
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కూడా మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రంలో నీళ్ల దోపిడీ జరిగినప్పుడు, ప్రజల సొత్తు దుర్వినియోగం అయినప్పుడు ఈటల బీఆర్ఎస్ (ఆనాటి టీఆర్ఎస్)లోనే ఉన్నారని, ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారని గుర్తుచేశారు. ఆనాడు జరిగిన తప్పిదాలను ప్రశ్నించకుండా మౌనంగా ఉన్న ఈటల.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు మద్దతు పలుకుతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ 12 ఏండ్ల బీజేపీ పాలనను ప్రజలు చూశారని, వారి గురించి తేలిసి ప్రజలు మళ్లీ గోతిలో పడరని అన్నారు. "జేపీ నడ్డా వచ్చినా.. ఎవరు వచ్చినా మాదొక్కటి సూటి ప్రశ్న. మీరు ఇస్తానన్న ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రానికి రావాలి" అని డిమాండ్ చేశారు. కేంద్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని, మీ 12 ఏళ్ల పాలనలో సామాన్య ప్రజలకు ఒరిగింది ఏంటని నిలదీశారు.
పార్టీలో క్రమశిక్షణ అందరికీ సమానమే..
కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై స్పందిస్తూ పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, అవన్నీ త్వరలోనే తొలగిపోతాయని స్పష్టం చేశారు. క్రమశిక్షణా కమిటీ అనేది అందరికీ సమానమేనని తేల్చిచెప్పారు. కడియం శ్రీహరి, కొండ సురేఖ, తుంగతుర్తి పంచాయతీ వ్యవహారాలపై ఇద్దరు సీనియర్ నాయకులను (సచిన్ సావంత్, జగ్గారెడ్డి) అబ్జర్వర్లుగా నియమించామని వెల్లడించారు. వారిద్దరూ క్షేత్రస్థాయి నుంచి విచారణ జరిపి పార్టీకి నివేదిక ఇస్తారని, ఆ తర్వాతే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కొంతమంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని సమర్థించుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన బాగుందని, జనాలు తమను ఆదరిస్తున్నారని మహేష్ కుమార్ గౌడే ధీమా వ్యక్తం చేశారు. వేరే పార్టీలు తలుపులు తెరిచి ఉంచినా, మూసి ఉంచినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఇక పార్టీలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ పదవుల భర్తీపై కీలక అప్డేడేట్ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్లతో చర్చించి కార్పొరేషన్ పదవులపై తుది నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చీఫ్ ప్రకటించారు.






