- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడువు ముగిసిన మాత్రలతో గర్భిణికి తీవ్ర అస్వస్థత..!
బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు ముగిసిన మాత్రలు ఇవ్వడం వల్ల ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైంది.

దిశ, బజార్‌హత్నూర్: బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) మాత్రలు ఇవ్వడం వల్ల ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు ఇటీవల గర్భం నిర్ధారణ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. అనంతరం వైద్య సిబ్బంది ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందించారు. ఆ మాత్రలను వాడిన కొద్ది సమయంలోనే గర్భిణికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆందోళనకు గురై ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య సిబ్బందిని నిలదీశారు. అయితే, "ఆ మాత్రలు మా ఆసుపత్రికి చెందినవి కావు" అని అక్కడి సిబ్బంది చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా, ఆసుపత్రిలో విధులు నిర్వహించే ఫార్మసిస్ట్ తరచూ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
డీఎంహెచ్‌వో వివరణ..
రోగులకు ఇచ్చే మందుల గడువు తేదీలను పరిశీలించి పంపిణీ చేయాల్సిన బాధ్యత ఫార్మసిస్ట్‌పై ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌పైరీ మందులు ఎలా పంపిణీ అయ్యాయి? వాటిని ఎవరు ఇచ్చారు? అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) సాధనను వివరణ కోరగా, ఆమె స్పందిస్తూ.. "గడువు ముగిసిన మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎవరు అందించారు? ప్రభుత్వ ఆసుపత్రి నుంచే ఇచ్చారా లేదా? అనే అన్ని అంశాలపై సమగ్ర విచారణ చేపడతాం. ఆసుపత్రిలో విధులు నిర్వహించే ఫార్మసిస్ట్ రోజువారీగా మందుల గడువు తేదీలను పరిశీలించి, ఎక్స్‌పైరీ మందులు రోగులకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ ఘటనలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా అనే విషయాన్ని కూడా విచారిస్తాం. విచారణలో ఎవరి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం." అని డీఎంహెచ్‌వో సాధన తెలిపారు.






