- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు తెలంగాణే ఫస్ట్.. ఆ తర్వాతే పార్టీ: ఎంపీ ఈటల సెన్సేషనల్ కామెంట్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల విషయానికొస్తే.. తనకు తెలంగాణే ఫస్ట్ అని, ఆ తర్వాతే పార్టీ, వ్యక్తిగతమని.. తాను ఎవరో పలికిస్తే పలికే వ్యక్తిని కాదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసి తెలంగాణలోని ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తున్నా.. ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుండా అన్నదాతలను కష్టాల పాలు చేయడం భావ్యం కాదన్నారు. వర్షాకాలం పంటలకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వల కింద.. బోర్లు, బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయడం సాధ్యం కాదన్నారు. ఇది నీళ్లు, సాగుపై అవగాహన ఉన్నవారికి మాత్రమే తెలుస్తుందని ధ్వజమెత్తారు. తాను హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో.. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వచ్చినప్పుడు తూములు ఎత్తించి తమ నియోజకవర్గ రైతులకు హీరో అయ్యానని, ఒకవేళ అదే నీళ్లు వరంగల్ వాసులకు చేరకపోతే తనపై చిందులు తొక్కేవారని గుర్తు చేసుకున్నారు.
అంతకు ముందే జలయజ్ఞం..
నీళ్ల కోసమే, నిధుల కోసమే, ఆత్మగౌరవం కోసమే ఉద్యమించిన చరిత్ర తెలంగాణదని.. ఇవాళ రాజకీయాలు, సిద్ధాంతాలు వేరై ఉండొచ్చు కానీ, మూలాలను మరిచిపోయినవాడు మనిషే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది చరిత్రను మరిచిపోయారని, కాళేశ్వరం కంటే ముందే వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం ప్రారంభమైందని గుర్తు చేశారు. జలయజ్ఞంలో భాగంగా ఆయన తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నీళ్లను తీసుకురావాలని ప్లాన్ చేశారని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాకే 24 టీఎంసీల సామర్థ్యంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. అప్పుడే మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణం కూడా ప్రారంభమైందని తెలిపారు. ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, కొండపోచమ్మ ప్రాజెక్టు, మల్లన్న సాగర్.. ఇలా కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలని మొదట ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీనే అనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు.
కాళేశ్వరంతోనే సంపూర్ణంగా రెండు పంటలు..
స్వరాష్ట్రం వచ్చాక రాష్ట్రానికి కడుపునిండా నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ల, ఆ తర్వాత ఎల్లంపల్లికి నీళ్లు తరలించేలా ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన 29 టీఎంసీల నీళ్లే నేడు మిడ్ మానేరు ప్రాజెక్టులో ఉన్నాయని తెలిపారు. రైల్వే జంక్షన్‌కు కాజీపేట ఎలాంటిదో.. ఇవాళ ఉత్తర తెలంగాణకు నీళ్ల అడ్డా మిడ్ మానేరు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పోచంపాడు ప్రాజెక్టులో 90 టీఎంసీలు, ఎల్ఎండీలో 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నప్పటికీ, గతంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క పంటకు కూడా నీళ్లు అందేవి కావని ఈటల రాజేందర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ అయ్యాక.. మిడ్ మానేరులోని 25 టీఎంసీల నీటితో పాటు పోచంపాడు ప్రాజెక్టు నీటిని కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లాలోని కొంత భాగానికి సంపూర్ణంగా రెండు పంటలు పండుతున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు, కాంట్రాక్టులు, డిజైన్ల మార్పుల గురించి తాను మాట్లాడటం లేదని.. కానీ, అసలు ఆ ప్రాజెక్టు కట్టడమే తప్పు అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు దుర్మార్గమని అన్నారు. కాళేశ్వరం పరిధిలోని ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని, భయంకరమైన కరువు వస్తుందని తెలిసి కూడా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






