- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడి పిల్లలతో ట్యాంకులు కడిగించిన హెడ్మాస్టర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
పుస్తకాలు పట్టి చదువుకోవాల్సిన విద్యార్థుల చేతులకు ఆ పాఠశాల హెడ్మాస్టర్ కడిగే బకెట్లు, చీపుర్లను అందించాడు.

దిశ, భూదాన్ పోచంపల్లి: పుస్తకాలు పట్టి చదువుకోవాల్సిన విద్యార్థుల చేతులకు ఆ పాఠశాల హెడ్మాస్టర్ కడిగే బకెట్లు, చీపుర్లను అందించాడు. విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయిలో నిలబెట్టాల్సిన గురువే.. విద్యార్థులను ప్రమాదకరమైన రీతిలో టాయిలెట్ల పైకి ఎక్కించి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించిన అమానుష ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థలను బంద్ చేశారు. అయితే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ప్రార్థన ముగిసిన తర్వాత 9, 10వ తరగతి విద్యార్థులను ఇంటికి పంపించకుండా వారితో వెట్టిచాకిరి చేయించాడు. ఆ పాఠశాల హెడ్మాస్టర్. టాయిలెట్లపై ఉన్న వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించడానికి కూలీలను పెట్టాల్సింది పోయి ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా విద్యార్థులు అని కూడా చూడకుండా టాయిలెట్ల పై కప్పు మీదికి ఎక్కించి ట్యాంకులను కడిగించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పిల్లలకు చదువు చెప్పమని బడికి పంపిస్తే ఇలాంటి పనులు చేయిస్తారా..? ప్రమాదవశాత్తు విద్యార్థులకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది..? అంటూ తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాల్సిన విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించిన సదరు హెడ్మాస్టర్ పై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






