రైతు ఆశీర్వాద సభకు ముందే రుణమాఫీ పూర్తి చేయాలి..

by Kodari Anjali |

వెంటనే పూర్తి స్థాయిలో పంట రుణమాఫీ అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి డిమాండ్ చేశారు.

రైతు ఆశీర్వాద సభకు ముందే రుణమాఫీ పూర్తి చేయాలి..
X

దిశ, బోనకల్: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతున్న నేపథ్యంలో, రుణమాఫీకి నోచుకోని రైతులకు వెంటనే పూర్తి స్థాయిలో పంట రుణమాఫీ అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని తూము ప్రకాష్ రావు భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనందరావు మాట్లాడుతూ.. బోనకల్ మండలంలో మొత్తం 7,820 మంది రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో రెండు లక్షల లోపు పంట రుణాలు ఉన్న 4,974 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అమలైందన్నారు. అయితే రెండు లక్షలకు పైగా పంట రుణాలు ఉన్న 3,496 మంది రైతులు ఇప్పటికీ రుణమాఫీకి నోచుకోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయ పెట్టుబడులు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులు పెరగడంతో రైతులపై అప్పుల భారం మరింత పెరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, బ్యాంకుల రుణాల ఒత్తిడి కారణంగా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రసంగాలు చేయడం కంటే ముందుగా..

ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయకపోవడం రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న "రైతు ఆశీర్వాద సభ"కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరై రైతులకు వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించనున్నారని తెలిపారు. అయితే సభల్లో హామీలు, ప్రసంగాలు చేయడం కంటే ముందుగా రుణమాఫీకి నోచుకోని రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన కోరారు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే రెండు లక్షలకు పైగా పంట రుణాలు ఉన్న రైతులకు కూడా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రచార సభల కంటే రైతుల సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, బోనకల్ మండలంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులందరికీ తక్షణమే న్యాయం చేయాలని యంగల ఆనందరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఏఐకేఎస్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జక్కుల రామారావు బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి ఆకెన పవన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story