- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుంగతుర్తి కాంగ్రెస్ వివాదంపై రంగంలోకి జగ్గారెడ్డి.. మరికాసేపట్లో గాంధీభవన్‍లో కీలక సమావేశం
తుంగతుర్తి కాంగ్రెస్ వివాదంపై మరికాసేపట్లో గాంధీభవన్‌లో జగ్గారెడ్డి నేతృత్వంలో కీలక అంతర్గత సమావేశం జరగబోతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తుంగతుర్తి కాంగ్రెస్ రచ్చ గాంధీభవన్‍కు చేరింది. మందుల సామేల్ వర్సెస్ చామల వర్గాల మధ్య విభేదాలు భగ్గుమనడంతో ఈ అంశంలో పీసీసీ పెద్దలు రంగంలోకి దిగారు. తుంగతుర్తి కాంగ్రెస్ లో వివాదాల పరిష్కారానికి పరిశీలకునిగా నియమితులైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి యాక్షన్‍లోకి దిగారు. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో తుంగతుర్తి పరిణామాలపై ఇవాళ జగ్గారెడ్డి పార్టీ అంతర్గత సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్‍లో నిర్వహించనున్న ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా మంత్రులతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను ఆహ్వానించాలని ఇప్పటికే సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యకు జగ్గారెడ్డి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆహ్వానం అందిన నాయకులందరు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ చేరుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.
అందరికీ న్యాయం జరిగేలా చూస్తా:
మండల అధ్యక్షుల నియామకాల విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్న పాత కాంగ్రెస్ నేతలు నిన్న గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మందుల సామేల్ కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని, సేవ్ కాంగ్రెస్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన నేతలతో నిన్న గాంధీ భవన్ వద్ద మాట్లాడిన జగ్గారెడ్డి.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. తుంగతుర్తి నేతల ఆందోళనలను తాను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తుంగతుర్తి వివాదం పరిష్కారానికి పరిశీలకునిగా జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నియమించారు. వివాదాల విషయంలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని సూచించారు. పార్టీ ఆదేశాలతో ఇవాళ జగ్గారెడ్డి తుంగతుర్తి కీలక నేతలతో భేటీ కానున్నారు. వారిచ్చిన ఫీడ్ బ్యాక్ ను పార్టీ పెద్దలకు నివేదిక సమర్పించనున్నారు.






