మీక్కూడా ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయా? జర భద్రం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-02 12:16:00  IST  )

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి పాల్పడుతున్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) హెచ్చరించింది. ‘ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్స్’ పేరుతో వస్తున్న మెసేజ్‌లలో ఏపీకే (APK) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయమని కోరుతూ సైబర్ నేరగాళ్లు మోసపూరిత మెసేజ్ లు పంపుతున్నారు.

మీక్కూడా ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయా? జర భద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి పాల్పడుతున్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) హెచ్చరించింది. ‘ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్స్’ పేరుతో వస్తున్న మెసేజ్‌లలో ఏపీకే (APK) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయమని కోరుతూ సైబర్ నేరగాళ్లు మోసపూరిత మెసేజ్ లు పంపుతున్నారు. ఈ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకోవచ్చని నమ్మించి, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.

పీఐబీ జారీ చేసిన హెచ్చరిక ప్రకారం.. ఎస్‌బీఐ ఎప్పుడూ SMS లేదా వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్ లేదా లింకులను పంపదు. ఈ మెసేజ్‌లలో చూపించే రివార్డ్ పాయింట్స్ (ఉదాహరణకు, రూ. 9980 విలువైన పాయింట్స్) ఈ రోజుతో గడువు ముగుస్తాయని, వెంటనే ‘ఎస్‌బీఐ రివార్డ్ యాప్’ ద్వారా రీడీమ్ చేసుకోవాలని సందేశాలు అత్యవసర పరిస్థితిని సృష్టిస్తాయి. అయితే.. ఈ ఏపీకే ఫైల్స్‌ (SBI APK Files)లో మాల్వేర్ (MalWare) ఉంటుంది. దీనిని ఇన్‌స్టాల్ చేయడం వల్ల బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, OTPలు వంటి సున్నితమైన సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ఈ స్కామ్‌ను గుర్తించిన పీఐబీ.. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేసింది. “ఎస్‌బీఐ రివార్డ్స్ కోసం ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేయమని మెసేజ్ వచ్చిందా? అలాంటి అనుమానాస్పద ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు. లింకులపై క్లిక్ చేయవద్దు” అని పీఐబీ స్పష్టం చేసింది. ఈ మోసాల నుంచి రక్షణ పొందేందుకు కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పీఐబీ సూచించింది. అనుమానాస్పద SMS లేదా వాట్సాప్ లింకులను క్లిక్ చేయవద్దని తెలిపింది.

"గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వంటి నమ్మకమైన సోర్స్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి.

నిజమైన ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్స్‌ను రీడీమ్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ (https://www.rewardz.sbi/)ను సందర్శించండి లేదా 1800-209-8500 నంబర్‌కు కాల్ చేయండి.

అనుమానాస్పద సందేశాలను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (https://cybercrime.gov.in)లో ఫిర్యాదు చేయండి లేదా 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి."

ఇటీవలి కాలంలో దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో.. కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సందేశాలను నమ్మవద్దని పీఐబీ సూచించింది. 2024 మొదటి త్రైమాసికంలోనే డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ.120.3 కోట్లు కోల్పోయినట్లు ప్రభుత్వ డేటా వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story