ఆలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ వివాదం : వారిపై స్థానిక యువకుల దాడి.. ఏడుగురి అరెస్ట్

by Ramesh Naini |   (  Updated:2026-03-28 08:07:36  IST  )

కర్ణాటకలోని సకలేశ్‌పుర సమీపంలో ఉన్న ప్రసిద్ధ ‘బెట్టద భైరవేశ్వర’ ఆలయంలో జరిగిన ఓ ప్రీ-వెడ్డింగ్ షూట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఆలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ వివాదం : వారిపై స్థానిక యువకుల దాడి.. ఏడుగురి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని సకలేశ్‌పుర సమీపంలో ఉన్న ప్రసిద్ధ ‘బెట్టద భైరవేశ్వర’ ఆలయంలో జరిగిన ఓ ప్రీ-వెడ్డింగ్ షూట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పవిత్రమైన గుడి ప్రాంగణంలోకి ఫోటోగ్రాఫర్లు బూట్లు వేసుకుని వచ్చారనే ఆరోపణలతో స్థానిక యువకులు వారిపై దాడికి దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ ప్రాంగణంలో ఫోటోలు తీయడాన్ని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఫోటోగ్రాఫర్లు బూట్లు వేసుకుని వచ్చారనే ఆరోపణలతో వారితో వాగ్వాదానికి దిగారు. అయితే ఎవరూ బూట్లు ధరించలేదని ఫోటో గ్రాఫర్లు వాదనను తిప్పికొట్టారు. దీంతో ఈ ఘర్షణ కాస్త భౌతిక దాడికి దారితీసింది. యువకులు ఫొటోగ్రాఫర్లను తీవ్రంగా కొట్టడమే కాకుండా, వారి కెమెరాను ధ్వంసం చేసినట్లు తెలిసింది.

ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గాయపడిన నవి, నందన్ అనే ఇద్దరు ఫొటోగ్రాఫర్లను చికిత్స కోసం సకలేశ్‌పుర తాలూకా ఆసుపత్రికి తరలించారు. దీంతో సకలేశ్‌పుర రూరల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన ఆశి, ప్రశాంత్, రక్ష, అరవింద్, ఉచిత్, ప్రజ్వల్, నిశాంత్ అనే ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

Next Story