ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం: రూ.17 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన IIT గ్రాడ్యుయేట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-16 03:37:40  IST  )

IIT ఢిల్లీ గ్రాడ్యుయేట్ చిరాగ్ మదాన్ రూ.17 లక్షల ప్యాకేజీ ఉన్న బ్యాంకింగ్ ఉద్యోగానికి రాజీనామా చేయడం ప్రస్తుతం నెట్టింట్లో కార్పొరేట్ ప్రపంచంలో టాక్సిక్ వర్క్ కల్చర్‌పై చర్చకు దారి తీసింది.

ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం: రూ.17 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన IIT గ్రాడ్యుయేట్
X

దిశ, వెబ్‌డెస్క్: కార్పొరేట్ ప్రపంచంలో టాక్సిక్ వర్క్ కల్చర్‌పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఐఐటీ ఢిల్లీ (IIT Delhi)కి చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు తనకు వస్తున్న భారీ జీతాన్ని వదులుకుని, ఉద్యోగానికి రాజీనామా చేసిన ఘటన ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. వివరాల్లోకి వెళితే.. చిరాగ్ మదాన్ (Chirag Madan) అనే ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్ ఓ ప్రముఖ కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిచేస్తున్నాడు. అతడికి ఏడాదికి రూ.17 లక్షల ప్యాకేజీ జీతం అందుతోంది. కానీ, ఆ ఉద్యోగంలో ఒత్తిడి భరించలేక అతను రాజీనామా చేశాడు. దీనికి సంబంధించి అతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మధ్యాహ్న భోజనానికి 15 నిమిషాలే..

పని ఒత్తిడి కారణంగా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే భోజనం ముగించాలని యాజమాన్యం ఒత్తిడి చేసేదని చిరాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవేళ అనారోగ్యం కారణంగా సెలవు అడిగితే వంద ప్రశ్నలు వేసేవారని, ఆరోగ్యం బాగోలేకపోయినా సెలవు దొరకడం గగనంగా మారిందని పేర్కొన్నాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సిన ఉద్యోగం కాస్తా.. రాత్రి 7 గంటల వరకు సాగేదని, వారానికి 5 రోజులు కాస్తా 6 రోజులకు మారిందని అన్నాడు. సుమారు రూ.10 కోట్ల విలువైన డీల్స్ క్లోజ్ చేయాలంటూ సేల్స్ టార్గెట్లు ఇచ్చేవారని, అవి పూర్తి చేయకపోతే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసేవారని వివరించాడు.

నెట్టింట్లో వైరల్ అవుతున్న చర్చ..

‘జీతం కంటే మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం ముఖ్యం’ అని చిరాగ్ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. చాలా మంది యువ ప్రొఫెషనల్స్ తాము కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా తమ ప్రాడక్ట్, పేరును పెంచుకునే క్రమంలో ఉద్యోగుల ఆరోగ్యాన్ని విస్మరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story