ఆ ఊళ్లో ఐస్‌క్రీం బండ్లకు నో ఎంట్రీ..! కట్‌చేస్తే గ్రామ శివారులో ఆసక్తికర ఫ్లెక్సీ ప్రత్యక్ష్యం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-20 05:48:24  IST  )

పోలవరం జిల్లా గూడూరు గ్రామస్తులు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆరోగ్యం కోసం గ్రామంలోకి ఐస్‌క్రీమ్‌ బండ్లు రావడంపై నిషేధం విధించారు.

ఆ ఊళ్లో ఐస్‌క్రీం బండ్లకు నో ఎంట్రీ..! కట్‌చేస్తే గ్రామ శివారులో ఆసక్తికర ఫ్లెక్సీ ప్రత్యక్ష్యం
X

దిశ, వెబ్‌‌డెస్క్: సాధారణంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు వద్దని, జూదం ఆడొద్దని గ్రామస్థులు నిషేధాజ్ఞలు విధిస్తుండటం చూస్తుంటాం. కానీ, ఏపీలోని ఓ గ్రామం మాత్రం విచిత్రంగా ‘ఐస్‌క్రీమ్’ బండ్లకు చెక్ పెట్టింది. వినడానికి వింతగా ఉన్నా, తమ పిల్లల ఆరోగ్యం కోసం కొత్తగా ఏర్పడిన పొలవరం (Polavaram)జిల్లా గూడూరు (Gurudu) గ్రామస్థులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా గ్రామ శివారులో వెలిసిన ఫ్లెక్సీ తెగ వైరల్ అవుతోంది.

అసలు ఏం జరిగిందంటే..

గూడూరు గ్రామంలోని చిన్నపిల్లలు తరచూ ఐస్‌క్రీమ్‌లు, నాసిరకం చిరుతిళ్లు తిని అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనివల్ల జలుబు, దగ్గుతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గమనించిన గ్రామ పెద్దలు, మహిళలు ఒకచోట చేరి ‘గ్రామ సభ’ నిర్వహించారు. కేవలం చర్చలతో ఆపకుండా, కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చారు.

కఠిన నిబంధనలు..

ఈ క్రమంలోనే గ్రామంలోకి ఐస్‌క్రీమ్ అమ్మేవారు రాకూడదని, ఒకవేళ వస్తే గ్రామస్థులే వారిని తరిమేయాలని నిర్ణయించారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి గ్రామంలోకి వస్తే వారికి రూ.5,000 జరిమానాను ఫిక్స్ చేశారు. అదేవిధంగా నాసిరకం రంగులు కలిపిన ఆహార పదార్థాలు, గడువు తీరిన స్నాక్స్ అమ్మే దుకాణాలపై నిఘా పెట్టారు. కేవలం ఆహారమే కాదు, గ్రామంలోని చెడు అలవాట్లను రూపుమాపేందుకు ఇప్పటికే గ్రామంలో ఉన్న బెల్ట్ షాపును గ్రామస్థులే స్వచ్ఛందంగా మూయించేశారు. గుడుంబా, ఇతర మత్తు పదార్థాలు వాడినా, విక్రయించినా గ్రామం నుండి బహిష్కరించేలా కఠిన నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం గూడూరు గ్రామస్థులు ఐక్యంగా తీసుకున్న నిర్ణయాల పట్ల చుట్టుపక్కల గ్రామస్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story