మైసూర్ సిల్క్ క్రేజ్ : తెల్లవారుజామున 4 గంటలకే క్యూ.. ఒక్కో చీర ధర ఎంతో తెలుసా?

by Ramesh Naini |   (  Updated:2026-01-20 13:04:22  IST  )

అది ఒక షోరూమ్ ముందు కనిపిస్తున్న దృశ్యం కాదు.. ఏదో భారీ సినిమా రిలీజ్ కో లేదా ఉచిత పథకాల కోసమో జరిగిన తోపులాట అంతకన్నా కాదు. అది స్వచ్ఛమైన మైసూర్ సిల్క్ చీరల కోసం మహిళలు పడుతున్న తాపత్రయం.

మైసూర్ సిల్క్ క్రేజ్ : తెల్లవారుజామున 4 గంటలకే క్యూ.. ఒక్కో చీర ధర ఎంతో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అది ఒక షోరూమ్ ముందు కనిపిస్తున్న దృశ్యం కాదు.. ఏదో భారీ సినిమా రిలీజ్ కో లేదా ఉచిత పథకాల కోసమో జరిగిన తోపులాట అంతకన్నా కాదు. అది స్వచ్ఛమైన మైసూర్ సిల్క్ చీరల కోసం మహిళలు పడుతున్న తాపత్రయం. కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (KSIC) షోరూమ్ వద్ద మైసూర్ సిల్క్ చీరల కోసం జనం తెల్లవారుజామున 4 గంటల నుంచే భారీ క్యూలలో నిలబడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ధర ఎక్కువైనా.. నాణ్యతకే ప్రాధాన్యం

సాధారణంగా పట్టు చీరల ధరలు వేలల్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కో చీర ధర రూ. 23 వేల నుంచి మొదలై ఏకంగా రూ. 2.5 లక్షల వరకు ఉంది. ఇంత భారీ ధర ఉన్నప్పటికీ, అసలైన పట్టు దొరుకుతుందనే నమ్మకంతో జనం గంటల తరబడి వేచి చూస్తున్నారు. మార్కెట్లో నకిలీ పట్టు చీరల బెడద ఎక్కువగా ఉండటంతో, ప్రభుత్వ రంగ సంస్థ అయిన KSIC నాణ్యతపై ప్రజలు పూర్తి భరోసా వ్యక్తం చేస్తున్నారు.

టోకెన్ ఉంటేనే ఎంట్రీ.. ఒక్కరికి ఒక్కటే!

విపరీతమైన రద్దీని తట్టుకోవడానికి అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తెల్లవారుజామున లైన్‌లో నిలబడిన వారికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్ ఉన్నవారికే షోరూంలోకి అనుమతి ఉంటుంది. అందరికీ చీరలు అందాలనే ఉద్దేశంతో, ఒక్కో కస్టమర్‌కు కేవలం ఒక చీర మాత్రమే విక్రయిస్తున్నారు.

ఎందుకీ డిమాండ్?

మైసూర్ సిల్క్‌కు ఉన్న జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ వల్ల దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడమే ఈ రద్దీకి ప్రధాన కారణం అని తెలిసింది. ఈ చీరలను నేయడానికి అనుభవజ్ఞులైన నేత కార్మికులు తక్కువగా ఉన్నారని, ఒక కొత్త కార్మికుడికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేయడానికి కనీసం 6 నుంచి 7 నెలల సమయం పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా కేవలం ప్రభుత్వ కేంద్రాల్లోనే వీటిని తయారు చేయడం వల్ల ఉత్పత్తి తక్కువగా ఉంటోంది. బంగారు జరీ, మెత్తని పట్టుకు మారుపేరైన మైసూర్ సిల్క్ చీరను సొంతం చేసుకోవడం ఒక హోదాగా భావిస్తుండటంతో, ఎంత ధరైనా.. ఎంత సేపు లైన్‌లో నిలబడాల్సి వచ్చినా వెనకాడటం లేదని కొనుగోలుదారులు చెబుతున్నారు.

Next Story