- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నం పెట్టిన చేతిని మరువని మూగ జీవాలు.. మహిళ హత్య గుట్టు రట్టు
ఫరీదాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తమకు అన్నం పెట్టిన మహిళను చంపి పాతిపెట్టిన అత్తమామలను రెడ్‌హ్యాండెడ్‌గా వీధికుక్కలు పట్టించాయి.

దిశ, వెబ్‌డెస్క్: విశ్వాసానికి మారుపేరుగా నిలిచే మూగజీవాలు, అన్నం పెట్టిన చేతికి ఆపద వస్తే ఊరుకోలేవని హర్యానా (Haryana) రాష్ట్రంలోని ఫరీదాబాద్ (Faridabad)లో జరిగిన ఈ ఘటన నిరూపించింది. తనను అల్లారుముద్దుగా చూసుకున్న యజమానురాలు కిరాతకుల చేతిలో హత్యకు గురైతే.. ఆ వీధి కుక్కలు మౌనంగా ఉండలేకపోయాయి. ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టిన చోట నిరంతరం మొరుగుతూ, పోలీసులకు నిందితుల గుట్టును పట్టించడంలో కీలక పాత్ర పోషించాయి. కన్నవారే కాలయములై ఒక ప్రాణాన్ని తీస్తే, ఆ మూగజీవాలు ఆమెకు న్యాయం జరిగేలా మృత్యుంజయులై నిలిచాయి.
కోడలిని హతమార్చిన అత్త, మామ..
ఫరీదాబాద్‌కు చెందిన ఓ వివాహిత గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది. ఆమె అత్తమామలు మాత్రం ఆమె ఎవరితోనో లేచిపోయిందని గ్రామస్థులను నమ్మబలికారు. అయితే, మృతురాలికి రోజూ వీధి కుక్కలకు అన్నం పెట్టే అలవాటు ఉంది. ఆమె కనిపించకుండా పోయినప్పటి నుంచి, ఆ ప్రాంతంలోని కుక్కలు ఒక నిర్దిష్టమైన ప్రదేశం వద్దకు వెళ్లి నిరంతరం మొరుగుతూ ఉండటాన్ని స్థానికులు గమనించారు.
కుక్కల అరుపులతో విషయం బయటకు..
మృతురాలి ఇంటి సమీపంలో కొత్తగా వేసిన కాంక్రీట్ రోడ్డు (Concrete Road), ఖాళీ ప్రదేశం వద్ద కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో పోలీసులకు (Police) అనుమానం వచ్చింది. కుక్కలు సూచించిన చోట తవ్వగా.. సుమారు 10 అడుగుల లోతులో పాతిపెట్టిన మహిళా మృతదేహం బయటపడింది. వరకట్న వేధింపులు, ఇతర కుటుంబ తగాదాల వల్ల అత్తమామలే ఆమెను హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ముందే గొయ్యి తీసి పాతిపెట్టారు. ఆ తర్వాత ఆ ప్రదేశంపై కాంక్రీట్ వేసి ఏమీ ఎరగనట్లుగా డ్రామా ఆడారు. ఈ మేరకు మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఆమె భర్త, మామ, అత్తను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమ నేరాన్ని ఒప్పుకున్నట్లుగా సమాచారం. తమకు అన్నం పెట్టి ఆదరించిన మహిళ ఇక లేదని తెలిసి, ఆ మూగజీవాలు చూపిన చొరవ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






