రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై హత్యాయత్నం

by Naga Rani Yarlagadda |

రెండేళ్లుగా ప్రేమలో ఉన్న జంట మధ్య పెళ్లి ప్రస్తావన చిచ్చుపెట్టింది. పెళ్లికి ప్రేయసి ఒప్పుకోకపోవడంతో ప్రియుడు విచక్షణా రహితంగా దాడిచేశాడు.

రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై హత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: వాళ్లిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగాల్లో సెటిలై.. పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరం పెళ్లి చేసుకుందామని యువకుడు అడగగా.. అందుకు ఆమె నిరాకరించింది. ఎప్పుడు పెళ్లి ఊసెత్తినా మాట దాటివేస్తుండటంతో కోపోద్రిక్తుడై.. యువతిపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లి (ట్రిచీ) జిల్లా ఖాజామలైలో ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద వెలుగుచూసింది. నవీన్, అమల రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమలు MBA చదువుతోంది. ఇక పెళ్లి చేసుకుందామని నవీన్ పలుమార్లు అడగ్గా.. అమల అందుకు ఒప్పుకోవడం లేదు. తన తల్లిదండ్రులు అందుకు అంగీకరించరని, బ్రేకప్ చేసుకుందామని చెప్పడంతో నవీన్ కు కోపం కట్టలు తెంచుకుంది. దాంతో బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. ఆమెపై పిడిగుద్దుల వర్షం కురిపించడంతో.. అక్కడే కుప్పకూలిపోయింది. అంతటితో ఆగకుండా సమీపంలో ఉన్న రాయితో అదే పనిగా బాదాడు. పూర్తిగా యువతి స్పృహ కోల్పోయింది. ఇదంతా తమ ఫోన్లలో రికార్డు చేసిన స్థానికులు.. నవీన్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. యువతిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.

Next Story