కర్ణాటకలో భూసేకరణ రణరంగం.. సర్వే అధికారులపై చీపుర్లతో తిరగబడ్డ మహిళా రైతులు

by Kema Shiva Kumar |

బెంగళూరు సమీపంలోని బిదాది పరిధిలో టౌన్‌షిప్ కోసం భూములను సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ మహిళా రైతులు సర్వే అధికారులపై చీపుర్లతో దాడికి దిగారు.

కర్ణాటకలో భూసేకరణ రణరంగం.. సర్వే అధికారులపై చీపుర్లతో తిరగబడ్డ మహిళా రైతులు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని బిదాది (Bidadi) పరిధిలో టౌన్‌షిప్ నిర్మాణం కోసం డీకే శివకుమార్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మండలహళ్లి (Mandalahalli) గ్రామంలో సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై స్థానిక మహిళా రైతులు చీపుర్లతో దాడికి దిగడంతో పాటు ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. అయితే, బిదాది పరిధిలో కొత్త టౌన్‌షిప్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సారవంతమైన వ్యవసాయ భూములను సేకరిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు మండలహళ్లి గ్రామంలో సర్వే పనులు ప్రారంభించారు. ఆ సమయంలో స్థానిక రైతులు తాము గతంలో సమర్పించిన భూసేకరణ పెండింగ్ పిటిషన్లపై అధికారులను వివరణ కోరారు. అయితే, అక్కడ ఉన్న ఓ అధికారి రైతుల ప్రశ్నలకు అత్యంత కఠినంగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

వాహనాలు ధ్వంసం.. పోలీసులు మోహరింపు

అధికారి సమాధానంతో ఆగ్రహించిన మహిళా రైతులు ఒక్కసారిగా సర్వే సిబ్బందిపై చీపుర్లతో విరుచుకుపడ్డారు. ఈ తోపులాట, ఘర్షణలో అధికారుల వాహనాలు దారుణంగా ధ్వంసమయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో బిదాది పోలీసులు, కేఎస్‌ఆర్‌పీ (KSRP) బలగాలు రంగంలోకి దిగి రైతులను అడ్డుకున్నాయి. సారవంతమైన తమ భూములను టౌన్‌షిప్ పేరిట లాక్కోవద్దంటూ రైతులు ఈ సందర్భంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Next Story