పారదర్శకంగా పౌరసత్వాన్ని నిర్ణయించాలి : ఫారినర్స్ ట్రిబ్యునళ్లకు సుప్రీంకోర్టు ఆదేశం

by I. Sairam |

పౌరసత్వాన్ని నిర్ణయించే సమయంలో పారదర్శకత పాటించాలని సుప్రీంకోర్టు ఫారినర్స్ ట్రిబ్యునళ్లను ఆదేశించింది.

పారదర్శకంగా పౌరసత్వాన్ని నిర్ణయించాలి :  ఫారినర్స్ ట్రిబ్యునళ్లకు సుప్రీంకోర్టు ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : పాత ఓటర్ల జాబితాలలో పేర్ల స్పెల్లింగ్స్ తప్పుగా పడటం, టైపింగ్ దోషాలు వంటి కారణాలతో విదేశీయులు అని ప్రకటించిన అసోంకు చెందిన 27 మందికి ఊరట లభించింది. ఈ విషయంలో గతంలో ఫారినర్స్ ట్రిబ్యునళ్లు, గౌహతి కోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 అప్పీళ్లను అనుమతించి, కొత్త విచారణ కోసం కేసులను తిరిగి ఆయా ఫారెనర్స్ ట్రిబ్యునళ్లకు పంపింది. పౌరసత్వం అనేది అత్యున్నత రాజ్యాంగ, చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన అంశమని, దీనిని నిర్ణయించేటప్పుడు నిష్పక్షపాత సూత్రాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

న్యాయబద్ధమైన విధానానికే ప్రాధాన్యత

చట్టవిరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే పూర్తి అధికారం, బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం అంగీకరించింది. కానీ, ఈ ప్రక్రియలో న్యాయబద్ధమైన విధానానికే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. పాత రికార్డులో ఉండే చిన్న తప్పులను సాకుగా చూపి పౌరసత్వాన్ని తిరస్కరించడం సరికాదని పేర్కొంది. ఓ వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ణయించే విధానం అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ 27 కేసులను తిరిగి కొత్తగా విచారించాలని ఫారినర్స్ ట్రిబ్యునళ్లను ఆదేశించింది. గతంలో ట్రిబ్యునళ్లు, గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రభావం లేకుండా ఈ కేసులను స్వతంత్రంగా తిరిగి పరిశీలించాలని స్పష్టం చేసింది.

Next Story