- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టగొడుగుల్లా జిమ్ లు
ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో నగరంలో ఫిట్‌నెస్ సెంటర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

దిశ, చంపాపేట్ : ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో నగరంలో ఫిట్‌నెస్ సెంటర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి కాలనీ, ప్రతి వీధిలో కొత్త జిమ్‌లు ప్రారంభమవుతున్నాయి. ఈ ఫిట్‌నెస్ సెంటర్లు నిజంగా ఆరోగ్యానికి భరోసానిస్తున్నాయా? లేక నిర్లక్ష్యానికి కేంద్రాలుగా మారుతున్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న అనేక జిమ్‌లలో కనీస భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక ఏర్పాట్లు, మహిళల రక్షణ చర్యలు, అర్హత కలిగిన ట్రైనర్లు, అత్యవసర వైద్య సదుపాయాలు ఉన్నాయా? లేదా? అన్నది సందేహాస్పదంగా మారింది. సంబంధిత శాఖల పర్యవేక్షణ కూడా కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహిళల భద్రతకు ఎవరి హామీ?
దేశవ్యాప్తంగా కొన్ని ఫిట్‌నెస్ సెంటర్లలో మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలు, రహస్య కెమెరాల ఆరోపణలు, వ్యక్తిగత శిక్షణ పేరుతో వేధింపుల ఫిర్యాదులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో నగరంలోని జిమ్‌లపై కూడా మహిళల్లో ఆందోళన నెలకొంది. కాగా, కొన్ని జిమ్‌లలో గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు లేని వ్యక్తులు ట్రైనర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. త్వరగా బాడీ బిల్డింగ్ పేరుతో స్టెరాయిడ్లు, నాణ్యతలేని సప్లిమెంట్లు వినియోగించాలని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భద్రత గాలికి..
నగరంలోని అనేక జిమ్‌లు బేస్‌మెంట్లు, ఇరుకైన భవనాల్లో నిర్వహించబడుతున్నాయి. అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్‌లు, అంబులెన్స్‌కు సమాచారం అందించే వ్యవస్థ, సరైన వెంటిలేషన్ వంటి భద్రతా ప్రమాణాలు అన్ని చోట్ల ఉన్నాయా అన్నది సందేహంగా మారింది. రోజూ వందలాది మంది వినియోగించే కేంద్రాల్లో ఒక ప్రమాదం జరిగినా భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఆశ్రయిస్తున్న ఫిట్‌నెస్ సెంటర్లు భద్రత, నాణ్యత, పారదర్శకతలోనూ ఆదర్శంగా నిలవాలి. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తు తనిఖీలు, కఠిన పర్యవేక్షణ, నిబంధనల కచ్చితమైన అమలుతో ప్రజల ప్రాణాలు, మహిళల భద్రతను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని నగరవాసులు స్పష్టం చేస్తున్నారు.






