16 నుంచి తెలంగాణ‌లో బోనాలు

by velandi.Saikiran |   (  Updated:2026-07-13 23:30:17  IST  )

16 నుంచి తెలంగాణ‌లో బోనాలు
X

దిశ, కార్వాన్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే చారిత్రాత్మక ఆషాఢ మాస బోనాల జాతరకు గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భాగ్యనగరంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ బోనాల ఉత్సవాలు ఈ నెల 16న అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు .

9 రోజుల పాటు ప్రత్యేక పూజలు..

గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి ఈ నెల 16న నిర్వహించే తొలి బోనంతో ఉత్సవాలు మొదలై, ఆగస్టు 13న ముగియనున్నాయి. ఈ జాతరలో భాగంగా అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. మొదటి పూజ: 16వ తేదీ (గురువారం) – ఉత్సవాల ప్రారంభం. రెండో పూజ: 19వ తేదీ (ఆదివారం), మూడో పూజ: 23వ తేదీ (గురువారం), నాలుగో పూజ: 26వ తేదీ (ఆదివారం), ఐదో పూజ: 30వ తేదీ (గురువారం) ఉదయం 10.30 గంటలకు చండీహోమం జరుపుతారు. ఆరో పూజ: 02వ తేదీ (ఆదివారం), ఏడో పూజ: 06వ తేదీ (గురువారం) – సాయంత్రం 5 గంటలకు అమ్మవారి పల్లకీ సేవ తీస్తారు. ఎనిమిదో పూజ: 09వ తేదీ (ఆదివారం), తొమ్మిదో పూజ: ఆగస్టు 13వ తేదీ (గురువారం) – అమ్మవారి సమారోహణ కుంభహారతితో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో, క్యూలైన్లు, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు..

నగరంలో ఎక్కడ బోనాలు ప్రారంభమైనా తొలి బోనం గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవార్లకే సమర్పించడం ఇక్కడి విశిష్టత. 28 కులవృత్తుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా రెండు పచ్చి మట్టి కుండల్లో నజర్ బోనాలను తయారు చేస్తారు. వీటిలో ఒక బోనాన్ని జగదాంబ అమ్మవారికి, మరొకటి మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. ఉత్సవాల ప్రారంభం రోజున లంగర్ హౌస్ చౌరస్తా వద్ద దేవాదాయ శాఖ తరపున ఏర్పాటు చేసే భారీ తొట్టెలకు రాష్ట్ర మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు..

లంగర్ హౌస్ నుంచి ప్రారంభమయ్యే ఈ భారీ తొట్టెల ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య సాగనుంది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, స్థానిక కళాకారుల ఆటపాటలు, డప్పు వాయిద్యాల మోతతో బడా బజార్, రిసాల బజార్ మీదుగా ఊరేగింపు కోటపైకి చేరుకుంటుంది. అనంతరం అమ్మవార్లకు నజర్ బోనాలు, పట్టు వస్త్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తోంది.

వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయ బోనాల ఉత్సవాల కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ తెలిపారు. చారిత్రాత్మక గోల్కొండ కోట నుంచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోందని ఆయన గుర్తుచేశారు.

ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని, భారీ తొట్టెలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వెల్లడించారు. అమ్మవార్లకు నజర్ బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని ఆకుల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

Next Story