- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెరిగిన మెట్రో రెండో దశ అంచనా వ్యయం..ఏకంగా రూ.4,335 కోట్లు!
హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశకు సంబంధించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు మొదటి దశ స్వాధీనానికి కావాల్సిన రూ.13,600 కోట్ల రుణం, రెండో దశ విస్తరణకు సంబంధించిన అంచనాలపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఇప్పటికే రెండో దశ ప్రతిపాదనల ఆమోదం కోసం పలుమార్లు కేంద్రమంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి మోడీని సైతం కలిసి విన్నవినించారు. కానీ కేంద్రం మాత్రం కనికరించడం లేదు. జాప్యం ఫలితంగా అంచనా వ్యయం కాస్తా రూ.4,330 కోట్లకు పెరిగింది. మొదటిసారిగా నవంబర్ 2024లో కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన అంచనా వ్యయం రూ.34,260 కోట్లు అయితే ఈ మధ్యకాలంలో అందజేసిన ప్రతిపాదనల అంచనా వ్యయం రూ.38,590 కోట్లకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంటే అంచనా వ్యయం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం భారం పడుతుందని పలువురు ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..
హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశకు సంబంధించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీనగర్-హయత్ నగర్ (7.1 కి.మీ.), జేబీఎస్ నుంచి మేడ్చల్ (24.5 కి.మీ), జేబీఎస్ నుంచి శామీర్‌పేట (22 కి.మీ) మొత్తం 122.6 కి.మీ.ల విస్తరణకు సంబంధించి 2024లో రాష్ట్ర ప్రభుత్వం రూ.34,260 కోట్లతో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇవే అంచనాలు 2026, జూన్ వరకు వచ్చేసరికి రూ.38,595 కోట్లకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రూ.4,335 కోట్లు పెరిగింది.
మొదటి దశ స్వాధీనానికి, రెండో దశ విస్తరణకు సంబంధించిన అంచనాలను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కన్సల్టెన్సీగా ఎస్బీఐ క్యాప్స్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ప్రకటించి 10 రోజులైనా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ ప్రతినిధిని ఇప్పటికే నియమించింది. త్వరగా కన్సల్టెన్సీకి సంబంధించిన ఉత్తర్వులు జారీచేస్తే మెట్రోరైలు ప్రాజెక్టు అసెస్‌మెంట్ ఆరునెలల్లో పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతో కేంద్రప్రభుత్వం ఉత్తర్వుల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. మొదటి దశ స్వాధీన ప్రక్రియ, మెట్రో రెండో దశ విస్తరణ, నిర్మాణ వ్యయం, రుణ సేకరణ అంశాలపై కన్సల్టెన్సీ సంస్థ ఎస్బీఐ క్యాప్స్ అధ్యయనం చేసి నివేదిక అందించనుంది. కన్సల్టెన్సీ అధికారులు మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తుల అంచనా వేయడానికి, విస్తరణ ప్రణాళికల పరిశీలన, డాక్యుమెంట్స్ స్క్రూట్నీ చేయడానికి డిసెంబర్ దాకా సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా మెట్రోరైలు ప్రతిపాదనల గురించి చర్చించడానికి సీఎం రేవంత్ మంగళవారం మరోసారి కేంద్రమంత్రులను కలిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
- Tags
- Metro
- metro train






