వన్యప్రాణులకు మృత్యుపాశం!

by velandi.Saikiran |   (  Updated:2026-07-13 20:03:15  IST  )

నిజామాబాద్ జిల్లాలో అక్రమ వేటగాళ్ల ఉచ్చులు, విషప్రయోగాలు, రోడ్డు ప్రమాదాలు చిరుతపులుల మనుగడకు మృత్యుపాశాలుగా మారాయి.

వన్యప్రాణులకు మృత్యుపాశం!
X

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్రమ వేటగాళ్ల ఉచ్చులు, విషప్రయోగాలు, రోడ్డు ప్రమాదాలు చిరుతపులుల మనుగడకు మృత్యుపాశాలుగా మారాయి. అడవుల్లో ఆహార కొరతతో చిరుతలు గ్రామాల్లోని పశువులపై దాడి చేస్తుండడంతో స్థానికులు వాటిపై కక్ష పెంచుకుని విషప్రయోగాలు చేస్తున్నారు. చిరుతల చర్మం, గోళ్లు, దంతాల అక్రమ రవాణా కోసం మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలు స్థానిక వేటగాళ్లను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో చిరుతల సంఖ్య 100కు చేరువవుతున్నా అటవీ గ్రామాల్లో అవగాహన లోపం, నిఘా లోపాలు వేటగాళ్లకు వరంగా మారుతున్నాయి. జాతీయ రహదారి 44కు ఇరువైపులా ఫెన్సింగ్, అండర్‌పాస్‌లు లేకపోవడంతో వాహనాలు ఢీకొని ఇప్పటివరకు 4 నంచి 5 చిరుతలు మృత్యువాత పడ్డాయి. భీమ్‌గల్ మండలంలోని కారేపల్లి అటవీ ప్రాంతంలో తాజాగా చిరుతను చంపిన కేసులో దేవక్కపేటకు చెందిన ఓ ఆర్‌ఎమ్‌పీ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుదైన ఈ జీవులను కాపాడేందుకు కెమెరా ట్రాప్‌లతోపాటు హైవేలపై రక్షణ వసతులు, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అడవుల్లో స్వేచ్ఛగా సంచరించాల్సిన చిరుతపులులు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఆహారం కోసం నివాస ప్రాంతాల వైపు వస్తున్న చిరుతలకు అక్రమ వేటగాళ్ల ఉచ్చులు, విషప్రయోగాలు, మరోవైపు జాతీయ రహదారులపై వేగంగా దూసుకెళ్లే వాహనాలు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు వన్యప్రాణుల సంరక్షణపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అడవుల్లో ఆహారం కొరత, నివాస ప్రాంతాల విస్తరణ వల్ల చిరుతలు అటవీ సమీప గ్రామాల్లోకి వస్తూ మేకలు, గొర్రెలు, లేగదూడలపై దాడి చేస్తున్నాయి. ఇదే సమయంలో వన్యప్రాణుల అక్రమ వేట ముఠాలు చిరుతలపై కన్నేసి, వాటి అవయవాల (గోళ్లు, దంతాలు) అక్రమ విక్రయాల కోసం విషం కలిపిన మాంసం వేయడం, విద్యుత్ తీగలు పెట్టడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నాయి. ఈ దందా వెనుక మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్లపై వెంటాడుతున్న మృత్యువు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంఖ్య వందకు చేరువలో ఉన్నట్లు అటవీ వర్గాల అంచనా. వీటి పర్యవేక్షణకు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, అక్రమ వేటను అడ్డుకోవడం సవాలుగా మారింది. మరోవైపు జాతీయ రహదారి 44 వన్యప్రాణులకు నరకంగా మారింది. రోడ్డుకిరువైపులా ఫెన్సింగ్, అండర్ పాసింగ్ వ్యవస్థ లేకపోవడంతో ఇప్పటివరకు వాహనాలు ఢీకొని 4నుంచి 5 చిరుతలు మృత్యువాత పడ్డాయి. 2018లో ఇందల్వాయి, 2023లో చంద్రాయన్‌పల్లి, 2025 సెప్టెంబర్ 1న జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ పరిధిలో జరిగిన ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. అండర్‌పాస్‌ల ఏర్పాటుకు అటవీశాఖ జాతీయ రహదారుల సంస్థకు ప్రతిపాదనలు పంపినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

విషప్రయోగంతో వధ.. కారేపల్లి ఘటనలో ఆర్ఎంపీ అరెస్ట్?

గతంలో కామారెడ్డి జిల్లాలో పశువులను చంపుతున్నాయనే కక్షతో చిరుతకు విషం పెట్టి చంపిన ఘటనపై కేసులు నమోదయ్యాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం కారేపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభించడం సంచలనం సృష్టించింది. ఈ ఉద్దేశపూర్వక హత్య ఉదంతంలో దేవక్కపేటకు చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించి, మరో ఇద్దరితో కలిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కేసుతో సంబంధమున్న మరో నలుగురైదుగురి కోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా గాలిస్తున్నారు.

నిఘా పటిష్ఠం కావాలి...

చిరుతల సంరక్షణ కేవలం కెమెరాలకే పరిమితం కాకుండా, అటవీ గ్రామాల్లో వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేటగాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు అంతర్రాష్ట్ర ముఠాల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, ప్రమాదాలు జరిగే హైవే ప్రాంతాల్లో ఫెన్సింగ్, అండర్‌పాస్‌ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే అడవులకు అందం తెచ్చే ఈ అరుదైన జీవులు అక్రమ వేటగాళ్లకు బలైపోయే ప్రమాదం ఉందని వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story