- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండో-నేపాల్ బార్డర్‌లో యూఎస్ మాజీ సైనికుడి పట్టివేత
యూపీలోని ఇండో - నేపాల్ సరిహద్దుల్లో యూఎస్ మాజీ సైనికుడు అక్రమంగా నేపాల్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ భద్రతా బలగాలకు చిక్కాడు.

దిశ, నేషనల్ బ్యూరో : అక్రమ మార్గంలో నేపాల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 36 ఏళ్ల అమెరికా పౌరుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఇండో-నేపాల్ బార్డర్‌లో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కాలిఫోర్నియాకు చెందిన జోర్డాన్ బ్రౌన్ అని, అమెరికా సైన్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ (గ్రీన్ బెరెట్) సైనికుడిగా పనిచేసినట్టు గుర్తించారు. యూఎస్ మాజీ సైనికుడు ఇలా నేపాల్‌కు ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించాడనేది భద్రతా వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
పేపర్లు చూపించక.. పొలాల్లోకి పరిగెత్తి..
జోర్డాన్ బ్రౌన్ అరెస్ట్ సినిమాటిక్ రేంజ్‌లో జరిగింది. ఎప్పటిలాగే యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలో గల ఇండో-నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉండే సొనౌలి కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చెందిన భాగవాన్‌పూర్ పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలో ఎస్ఎస్‌బీ సైనికులు శనివారం గస్తీకాస్తున్నారు. అయితే ఆ సమయంలో బోర్డర్ పిల్లర్ నంబర్ వద్ద జోర్డాన్ బ్రౌన్ కాలి నడకన నేపాల్ వైపు నడిచి వెళ్తుండటాన్ని సైనికులు గమనించి ఆపారు. వివరాలు అడిగి గుర్తింపు పత్రాలు చూపించాలని కోరారు. అయితే అతడు అవేవీ చూపించకుండా, వారి నుంచి తప్పించుకోవాలని తిరిగి భారత భూభాగంపై వైపు పారిపోయాడు. దగ్గరలోని పొలాల్లోకి పరిగెత్తగా, అతడిని తరుముకుంటూ సైనికులు వెళ్లారు. చివరికి రైతుల సాయంతో బ్రౌన్‌ను పట్టుకున్నారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించారు.
అక్రమ ప్రవేశంపై కేసు నమోదు
విచారణాధికారులు బ్రౌన్ ను యూఎస్ పౌరుడిగా గుర్తించి అక్రమ ప్రవేశంపై కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో బ్రౌన్ అధికారులతో మాట్లాడుతూ.. తాను వియత్నాంలో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నానని, ఆ తర్వాత బంగ్లాదేశ్ మీదుగా ప్రయాణించి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించానని తెలిపాడు. ఆపై నేపాల్ దాటడానికి ప్రయత్నించానని చెప్పాడు. అతడి వద్ద వాలిడ్ పాస్‌పోర్ట్, వీసా లేదా ఇతర గుర్తింపు పత్రాలు ఏవీ లేవని అధికారులు గుర్తించారు. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు, అనధికార మార్గం ద్వారా ఇండో-నేపాల్ సరిహద్దును దాటడానికి ప్రయత్నించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతానికి అతడిపై గూఢచర్యం లేదా ఉగ్రవాదానికి సంబంధించిన ఎలాంటి ఆరోపణలు నమోదు కాలేదు.
రహస్య మిషన్ కోసమే వచ్చాడా ?
గోవా తీరంలో తనకు పరిచయమైన ‘నాజ్’ అనే వ్యక్తిని కలవడానికి తాను నేపాల్ వెళ్తున్నట్లు బ్రౌన్ అధికారులతో తెలిపాడు. అయితే అతడి ఇంటి పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ వంటి వివరాలను తెలియజేయలేదు. రెండేళ్ల క్రితం ఇటలీలో ఒక భారతీయ యోగా శిక్షకురాలిని వివాహం చేసుకున్నట్లు కూడా అతడు వెల్లడించాడు. అయితే అతడి మాటల్లో ఎంత వరకు నిజం ఉందనేది భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం బ్రౌన్ ప్రయాణించిన మార్గం, వివిధ దేశాలలో అతని పరిచయాలు, కదలికలపై పలు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. కాగా.. సాధారణంగా విదేశాలలో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న ఏ అమెరికా పౌరుడైనా తన ప్రయాణ పత్రాల కోసం సమీపంలోని యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్‌ను ఆశ్రయిస్తారు. అయితే బ్రౌన్ ఈ అధికారిక మార్గాలను వదిలి ఎందుకు అనధికారిక మార్గంలో అంతర్జాతీయ సరిహద్దును దాటడానికి ప్రయత్నించాడనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. అతడు ఏదైనా అంతర్జాతీయ గూఢచర్యానికి లేదా రహస్య మిషన్‌కు పాల్పడుతున్నాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాయి.






