నేపాల్‌లో మళ్లీ జెన్ జీ ఉద్యమం.. ప్రధాని బాలేన్ షా రాజీనామాకు డిమాండ్

by I. Sairam |

నేపాల్‌లో మళ్లీ జెన్ జీ ఉద్యమం మొదలైంది. ఓ యువకుడి ఆత్మహత్యపై దేశంలోని యువత రోడ్లపైకి వచ్చి, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నేపాల్‌లో మళ్లీ జెన్ జీ ఉద్యమం.. ప్రధాని బాలేన్ షా రాజీనామాకు డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో : నేపాల్‌లో మరో సారి జెన్ జీ ఉద్యమం మొదలైంది. ఆ దేశ రాజధాని ఖాట్మండులోని ఓ ప్రభుత్వ కార్యాలయం వెలుపల ఓ బైక్ రైడర్ ఆత్మహుతి తాజా నిరసనలకు కారణమైంది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ అటు పార్లమెంట్‌లోనూ, ఇటు వీధుల్లోనూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. యువత మద్దతుతోనే అధికారంలోకి వచ్చిన ప్రధాని బాలెన్ షా, ఇప్పుడు సామాన్యుల పొట్టకొడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం కేసును దర్యాప్తు చేయడానికి ఐదుగురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

పోలీసుల చర్య.. యువకుడి ఆత్మహత్య

రైడ్-షేరింగ్ మోటార్ బైక్ రైడర్‌గా జీవనోపాధి పొందుతున్న గణేష్ నేపాలి (25) తన బైక్‌కు ఈ నెల 9వ తేదీన ఖాట్మండు మెట్రోపాలిటన్ పోలీసులు లాక్ చేశారు. పాస్‌పోర్ట్ కార్యాలయం వెలుపల బహిరంగ ప్రదేశంలో బైక్‌ను పార్క్ చేశారనే ఆరోపణతో అతనికి 1,000 నేపాలీ రూపాయల జరిమానా విధించారు. దీంతో పోలీసుల అధికారులకు గణేష్‌కు మధ్య మాటల వివాదం జరిగింది. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన గణేష్ తన బైక్ ట్యాంక్ నుండి పెట్రోల్ తీసి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేసినప్పటికీ, అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఖాట్మండులోని బీర్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో నేపాల్ యువకులు మైతీఘర్ మండలా వద్ద పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేద, కార్మిక వర్గాల కష్టాల పట్ల ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతమైన, స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోవింద థపాలియా నేతృత్వంలో ప్రభుత్వం ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న పోలీసులను విచారణ పూర్తయ్యేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

Next Story