మీడియాలో మోతమోగుతున్న కుందన్ బాగ్ దయ్యాల కోట.. ఆ భవనంలో అర్ధరాత్రి తిరిగేది ఎవరు..?

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-27 14:17:44  IST  )

యూట్యూబర్స్ వ్యూస్ కోసం ఏమైనా చేస్తారు. లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు చూపించడంలో సిద్ధహస్తులు.

మీడియాలో మోతమోగుతున్న కుందన్ బాగ్ దయ్యాల కోట.. ఆ భవనంలో అర్ధరాత్రి తిరిగేది ఎవరు..?
X

దిశ, వెబ్‌డెస్క్ : యూట్యూబర్స్ వ్యూస్ కోసం ఏమైనా చేస్తారు. లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు చూపించడంలో సిద్ధహస్తులు. ఇలాంటి వక్రీకరణ వీడియోలతో ఎంతో మంది యూట్యూబర్స్ జైలుకు వెళ్లిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయినా కొంత మంది అదే దారిని ఎంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉన్న ఓ పురాతన భవనాన్ని దయ్యాల నిలయంగా మార్చి అర్ధరాత్రిళ్లు వీడియోలు తీస్తున్నారు. ఈ యూట్యూబర్స్ హడావుడికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇంతకూ విషయం ఏంటంటే..?

బేగంపేట పరిధిలోని కుందన్ బాగ్‌లో ఓ పురాతన భవనం ఉంది. చాలా ఏళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కొన్నాళ్లుగా పాడుపడ్డ ఆ భవనంలో దయ్యాలు ఉన్నాయని స్థానికులు సైతం అటువైపు వెళ్లరు. ఇదే ప్రచారాన్ని నమ్మిన యూట్యూబర్స్ అర్ధరాత్రి వేళ దయ్యాలను వీడియోలను తీయడానికి క్యూ కడుతున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు గ్రూపులుగా వచ్చి హల్ చల్ చేస్తున్నారు. వీళ్ల న్యూసెన్స్‌కు ఇబ్బంది పడ్డ స్థానికులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 35 మంది యూట్యూబర్స్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ భవనం ముందు బందోబస్త్ పెట్టారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ ప్రచారం నేపధ్యంలో పంజాగుట్ట పోలీసులు ఓ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు. “కుందన్ బాగ్‌లోని పాత భవనంపై వస్తున్న వందంతులు ఎవరు నమ్మవద్దు, పుకార్లు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కుందన్ బాగ్‌లో ప్రశాంత వాతావరణం ఉంది” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రాత్రిళ్లు భవనంలో తిరిగే ఆ ఇద్దరు ఎవరు..?

ఇదంతా ఎలా ఉన్నా.. ఆ పాడుబడ్డ భవనంలో దయ్యాలు ఉన్నాయని, వాటిని మేము కూడా చూశామని స్థానికులు చెబుతుండటం గమనార్హం. వారి కథనం ప్రకారం.. కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తి దొంగతనానికి ఆ భవనానికి వెళ్లాడట. కానీ ఆ బిల్డింగ్‌లో ముగ్గురు మహిళల మృతదేహాలు కుళ్లిపోయి కళేబరాలు బయటపడి ఉండటం చూసి భయపడ్డాడట. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా.. తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతదేహాలుగా గుర్తించారు. వాళ్లు చనిపోయి ఆరు నెలలు దాటిందని నిర్ధారించుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కానీ రోజు రాత్రి వేళ ఇద్దరు మహిళలు కొవ్వొత్తులు పట్టుకోని ఇంటి ఆవరణలో నడిచేవారని, ఇంటి ముందు ఓ రక్తం బాటిల్ కూడా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఆ ఇద్దరు దయ్యాలేనని అందుకే ఆ ఇంటి వైపు ఎవరూ వెళ్లరని స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లను నమ్మి యూట్యూబర్స్ వీడియోలు చేయడం ప్రారంభించారు. ఈ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుండటంతో మిగతా వాళ్లు సైతం క్యూకట్టి స్థానికులను ఇబ్బందులకు గురి చేసి పోలీస్ స్టేషన్‌లో పడ్డారు.

Next Story