ఇంకెన్నేళ్లు ఈ నిరీక్షణ?.. గోదావరి కొత్త వారధి మరమ్మతుల్లో తీవ్ర జాప్యం

by Jakkula.Mamatha |

భద్రాచలం గోదావరిపై నిర్మించిన నూతన వారధి మరమ్మతు పనులలో తీవ్ర జాప్యం నెలకొంది.

ఇంకెన్నేళ్లు ఈ నిరీక్షణ?.. గోదావరి కొత్త వారధి మరమ్మతుల్లో తీవ్ర జాప్యం
X

దిశ, భద్రాచలం: భద్రాచలం గోదావరిపై నిర్మించిన నూతన వారధి మరమ్మతు పనులలో తీవ్ర జాప్యం నెలకొంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా.. మే నెలలో సారపాక వైపు అప్రోచ్ రోడ్డు కుంగిపోయి వంతెనపై రాకపోకలు నిలిపి వేశారు. మూడు నెలలు పూర్తి కావస్తున్నా, ఇంకా మరమ్మతు పనులు పూర్తి కాలేదు. పాత వంతెన పైనుండే వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నారు. కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, అప్పటి రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వంతెనకు శ్రీకారం చుట్టారు. రూ.98.45 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన నిర్మాణ పనులు రాజ్దీప్ బిల్డ్ కాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దక్కించుకోగా.. నిర్మాణానికి 9 సంవత్సరాలు పట్టింది. నిర్మాణ సమయంలోనే అనేక లోపాలు తలెత్తినా.. అధికారులు బయటకు తెలియనీయకుండా కన్స్ట్రక్షన్ కంపెనీని కాపాడుతూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

2024 ఏప్రిల్ 17న కొత్త హైలెవెల్ వంతెన ప్రారంభం కాగా.. 2026 మే నెలలో అప్రోచ్ రోడ్డు కుంగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఎన్‌హెచ్ఏఐ అధికారుల పర్యవేక్షణలో వంతెన నిర్మించిన రాజ్ దీప్ బిల్డ్ కాన్ సంస్థ మరమ్మత్తు పనులు చేపడుతుంది. వంతెన నిర్మాణ లోపాలు,లయబిలిటీ పీరియడ్ నిబంధనల ప్రకారం వంతెన నిర్మాణ సంస్థ బాధ్యత వహించి కుంగిపోయిన అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపడుతుంది. అయితే పాత వంతెనకు, కొత్త వంతెనకు మధ్య సరైన రిటైనింగ్ వాల్ నిర్మించకపోవడం చేతనే అప్రోచ్ రోడ్డు కుంగిపోయిందని అధికారులు గుర్తించారు. అయినా సంబంధిత కన్స్ట్రక్షన్ కంపెనీ పై చర్యలు తీసుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా నాసిరకంగా నిర్మాణం చేపట్టడానికి ఎన్ హెచ్ ఏ ఐ అధికారుల పర్యవేక్షణ కూడా లోపం కావడం కారణంగానే కన్స్ట్రక్షన్ కంపెనీ పై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

గోదావరి వరదలు తట్టుకునేనా?

భద్రాచలం గోదావరి పై ప్రస్తుతం ఉన్న పాత వంతెనను 1965 లో ముంబై కి చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించింది. అప్పటినుండి.. ఇప్పటివరకు గోదావరికి 76 అడుగులకు పైగా వరద వచ్చినా చెక్కు చెదరలేదు.కాని ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త వంతెన రెండు సంవత్సరాలు పూర్తి కాకుండానే కుంగిపోయుంది. ఇటువంటి పరిస్థితిలో 70 అడుగులు దాటి గోదావరి వస్తే.. కొత్త వంతెన నిలుస్తుందా..? కొట్టుకుపోతుందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Next Story