- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రామాయణ'కు సోనీ పిక్చర్స్ తోడైంది.. ప్రపంచవ్యాప్త విడుదలకు భారీ అడుగు
'రామాయణ' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో భాగస్వామ్యం కుదిరినట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో 'రామాయణ' ఒకటి. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. కన్నడ స్టార్ యశ్ రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రముఖ హాలీవుడ్ స్టూడియో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో భాగస్వామ్యం కుదిరినట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, 'రామాయణ'ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న తన కల ఇప్పుడు నిజమవుతోందని తెలిపారు. ఈ భాగస్వామ్యంతో సినిమా ట్రైలర్‌ను కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భారతీయ సినిమా చరిత్రలో ఇది గర్వించదగ్గ ఘట్టమని పేర్కొన్న ఆయన, ఈ చిత్రం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, గొప్ప ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ ప్రయాణానికి మద్దతు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశ యువతే భారత భవిష్యత్తని, మన సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.






