సింగరేణిలో భద్రతా పరికరాల కొరత పై కార్మికుల ఆందోళన

by Jakkula.Mamatha |

"బొగ్గు ఉత్పత్తి చేసే చేతులకు ముందు భద్రత కల్పించాలి.. ఉత్పత్తి లక్ష్యాల కంటే కార్మికుల ప్రాణాలే విలువైనవి" అనే అభిప్రాయం కార్మిక వర్గంలో బలంగా వినిపిస్తోంది.

సింగరేణిలో భద్రతా పరికరాల కొరత పై కార్మికుల ఆందోళన
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: "బొగ్గు ఉత్పత్తి చేసే చేతులకు ముందు భద్రత కల్పించాలి.. ఉత్పత్తి లక్ష్యాల కంటే కార్మికుల ప్రాణాలే విలువైనవి" అనే అభిప్రాయం కార్మిక వర్గంలో బలంగా వినిపిస్తోంది. దేశానికి బొగ్గు అందించే సింగరేణి సంస్థలో కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ గనులు, వర్క్‌షాపులు, థర్మల్ ప్లాంట్లు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో విధులు నిర్వహిస్తున్న వేలాది మంది కార్మికులకు అవసరమైన వ్యక్తిగత భద్రత పరికరాలు (PPE) పూర్తిస్థాయిలో అందడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా పరికరాల కొరత కారణంగా రోజువారీ విధుల్లో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని వారు చెబుతున్నారు.

పని స్వభావానికి తగ్గ పరికరాలే లేవు..

గనుల్లో బరువైన వస్తువులను మోయడం, విద్యుత్ పనులు, వెల్డింగ్, ఎత్తైన ప్రాంతాల్లో మరమ్మతులు, బొగ్గు ధూళి మధ్య పనిచేయడం వంటి ప్రమాదకర పరిస్థితుల్లో కార్మికులు విధులు నిర్వహిస్తుంటారు. అయినప్పటికీ అవసరమైన ఇంపాక్ట్ గ్లోవ్స్, కట్-రెసిస్టెంట్ గ్లోవ్స్, ఎలక్ట్రికల్ ఇన్సులేటెడ్ గ్లోవ్స్, ఫుల్ బాడీ హార్నెస్‌లు, సేఫ్టీ గ్లాసెస్, నాణ్యమైన మాస్కులు, ఎలక్ట్రికల్ సేఫ్టీ టూల్స్ తగినంతగా అందడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదాలు జరుగుతున్నా మారని పరిస్థితి..

సింగరేణిలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నప్పటికీ భద్రతా వ్యవస్థలో లోపాలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ప్రమాదం తర్వాత భద్రతపై సమీక్షలు, సూచనలు వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కార్మికులకు అవసరమైన పరికరాల సరఫరాలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

కార్మిక సంఘాల డిమాండ్..

ప్రతి ఉద్యోగికి వారి విధుల స్వభావాన్ని బట్టి నాణ్యమైన భద్రతా పరికరాలు వెంటనే అందించాలని, పాతబడిన లేదా దెబ్బతిన్న పరికరాలను వెంటనే మార్చాలని, ప్రతి గనిలో పీపీఈ స్టాక్‌ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా ప్రమాణాల అమలుపై స్వతంత్ర తనిఖీలు నిర్వహించాలని కూడా కోరుతున్నాయి.

నిపుణుల అభిప్రాయం..

పరిశ్రమల భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రమాదాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, సరైన వ్యక్తిగత భద్రతా పరికరాల వినియోగం వల్ల తీవ్ర గాయాలు, ప్రాణనష్టం గణనీయంగా తగ్గించవచ్చు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి పని స్వభావానికి తగ్గ పీపీఈ అందించడం యాజమాన్య బాధ్యతగా వారు సూచిస్తున్నారు.

యాజమాన్యం స్పందించాల్సిన సమయం..

సింగరేణి దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల్లో ఒకటి. ఉత్పత్తి లక్ష్యాలతో పాటు కార్మికుల ప్రాణ భద్రతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. భద్రతా పరికరాల కొరత పై వచ్చిన ఫిర్యాదులను యాజమాన్యం వెంటనే పరిశీలించి, అవసరమైన పీపీఈని అన్ని ఏరియాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారు.

Next Story