- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి..? అవసరమైన పత్రాలు ఏమిటి..?
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానంలో భాగంగా రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తహసీల్దార్ సూర్యప్రకాశ్ తెలిపారు.

దిశ, రెబ్బెన:- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానంలో భాగంగా రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తహసీల్దార్ సూర్యప్రకాశ్ తెలిపారు. భూముల కొనుగోలు, విక్రయాలు చేపట్టే వారు ముందుగా మీసేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకుని, కేటాయించిన తేదీ, సమయానికి మండల తహసీల్దార్ కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మకందారు, కొనుగోలుదారు ఇద్దరూ తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాలని, వారితో పాటు ఇద్దరు సాక్షులను కూడా తీసుకురావాలని తెలిపారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, భూమికి సంబంధించిన యాజమాన్య పత్రాలు, పట్టాదారు పాస్‌బుక్, ఇతర అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం వాటిని పరిశీలించి బయోమెట్రిక్ ధ్రువీకరణతో తహసీల్దార్ సమక్షంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌కు కేటాయించిన స్లాట్‌ను తప్పనిసరిగా వినియోగించుకోవాలని, అనివార్య కారణాలతో స్లాట్ మిస్ అయితే సంబంధిత మీసేవ కేంద్రం లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి తదుపరి ప్రక్రియపై సమాచారం తెలుసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వ నిబంధనల మేరకు కొత్త స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు ముందు భూమికి సంబంధించిన సర్వే నంబర్, విస్తీర్ణం, యాజమాన్య వివరాలు, పత్రాలన్నింటినీ ఒకసారి సరిచూసుకోవాలని సూచించారు. ప్రజలు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సందేహాలు ఉంటే మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని తహసీల్దార్ సూర్యప్రకాశ్ కోరారు.






