దేవాలయ భూములకు బహిరంగ వేలం లేదు..దేవుడికి ధూప దీప నైవేద్యం లేదు

by Ratna Kumari |

మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన సుమారు 30 ఎకరాల ఎండోమెంట్ భూమికి బహిరంగ వేలం నిర్వహించి దేవుడికి ప్రతినిత్యం ధూప దీప నైవేద్యం జరగాలని కోరుతూ వీపనగండ్ల మండల కేంద్రంలో మహనీయుల విగ్రహాల ఎదుటరైతులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

దేవాలయ భూములకు బహిరంగ వేలం లేదు..దేవుడికి ధూప దీప నైవేద్యం లేదు
X

దిశ, వీపనగండ్ల : మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన సుమారు 30 ఎకరాల ఎండోమెంట్ భూమికి బహిరంగ వేలం నిర్వహించి దేవుడికి ప్రతినిత్యం ధూప దీప నైవేద్యం జరగాలని కోరుతూ వీపనగండ్ల మండల కేంద్రంలో మహనీయుల విగ్రహాల ఎదుటరైతులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వీరికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బిజెపి ఎమ్మార్పీఎస్, హిందు వాహినితోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య మద్దతు తెలిపి మాట్లాడారు.గ్రామంలోని అగ్రకులానికి చెందిన ఒక కుటుంబం తమ సొంత ఆస్తుల భావిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ దేవాలయానికి శఠగోపం పెడుతున్నారని ఆరోపించారు. గత రెండు సంవత్సరాల క్రితం దేవాలయ పూజారి చనిపోవడంతో దేవాలయ తలుపులు కూడా తెరిచే దిక్కు లేకుండా పోయిందని, దీనితో చెన్నకేశవ స్వామి ధూప దీప నైవేద్యానికి నోచుకోకుండా పస్తులున్న పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు.

దేవాలయ భూములకు వేలంపాటలు నిర్వహించాలని పలుమార్లు కమీషనర్ను కలిసి వినతి పత్రాల అందించిన ఫలితం లేకుండా పోయిందని, సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని వారు అన్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎకరం 15 వేల రూపాయలు కౌలుకు తీసుకుంటున్నారని, ఆ లెక్కన తాము సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తామంటున్నా కూడా దేవాదాయ అధికారులు పట్టించుకోకుండా అదే కుటుంబానికి సంవత్సరానికి ₹1,75,000 ప్రకారం మూడు సంవత్సరాలకు కౌలుకు ఇచ్చినట్లు అధికారులు అధికారులు తెలిపారని వారు వివరించారు.గ్రామంలో ఇప్పటికీ పెత్తందారీ వ్యవస్థ కొనసాగుతోందని, సామాన్య ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా కొందరి ఆధిపత్యంలో వ్యవహారాలు సాగుతున్నాయని ఆరోపించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కూడా వారు తెలిపారు.ఆలయ భూమి గ్రామ ప్రజలందరి ఆస్తి అని, దానిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఆలయ భూమిపై ఎలాంటి ఆక్రమణలు లేదా అనధికార ప్రవేశాలు జరగకుండా అడ్డుకుంటామని, ఈ విషయంలో ఎంతదూరమైనా పోరాటం చేస్తామని ప్రకటించారు. తమపై అక్రమ కేసులు నమోదు చేసినా భయపడబోమని, ఆలయ భూమి హక్కుల పరిరక్షణ కోసం గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు అరుణ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మహేష్ యాదవ్, బిజెపి జిల్లా వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల శీను, వివిధ జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు,

Next Story