ఘోర ప్రమాదం.. వాహనంపై విరిగిపడిన కొండచరియలు : 13 మంది మృతి

by Naga Rani Yarlagadda |

హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లా లాహౌల్-స్పితిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఘోర ప్రమాదం.. వాహనంపై విరిగిపడిన కొండచరియలు : 13 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లా లాహౌల్-స్పితిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం వేళ ఉదయ్‌పూర్-కిలార్ రహదారిపై గల 'కడూ నాలా' వద్ద ఒక్కసారిగా భారీ కొండచరియలు (LandSlides) విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో మార్గమధ్యలో వెళ్తున్న ఒక టాటా సుమో టాక్సీ కొండచరియల కింద చిక్కుకుని తీవ్రంగా ధ్వంసమైంది. ఈ వాహనంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా, మిగిలిన వారంతా మరణించినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది.

మంటల్లో వాహనం – వీడియోలు వైరల్

ఈ దుర్ఘటనను భర్మోర్-పాంగి నియోజకవర్గ ఎమ్మెల్యే జనక్ రాజ్ ధ్రువీకరించారు. కొండచరియలు పడిన వెంటనే టాటా సుమో వెనుక భాగంలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు, భద్రతా సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండచరియలు పడి వాహనం నుజ్జునుజ్జు కావడం, మంటలు చెలరేగడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

నిన్న రహదారి బంద్.. తెరుచుకున్న కొద్దిసేపటికే ఘోరం!

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉదయ్‌పూర్-కిలార్ మార్గం గురువారం బంద్ కావడంతో ప్రయాణికులంతా 'తిందీ' ప్రాంతంలో బస చేశారు. శుక్రవారం ఉదయం రహదారిని పునరుద్ధరించడంతో వారు పాంగి వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో కడూ నాలా వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కొండపై నుంచి భారీ రాళ్లు, కొండ చరియలు వాహనంపై పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై సమాచారం అందగానే లాహౌల్-స్పితి డిఎస్పీ రష్మి శర్మ నాయకత్వంలో పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే జనక్ రాజ్ చంబా, లాహౌల్-స్పితి జిల్లాల కలెక్టర్లతో (DC) మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం పోలీసు, పరిపాలన, సహాయక బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో మునిగిపోయాయి. బాధితులంతా పాంగి లోయకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. అయితే మృతుల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రజలు ఎవరూ వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

Next Story