విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి: జిల్లా కలెక్టర్

by Taduka Kalyani |

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం సంబంధిత అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి: జిల్లా కలెక్టర్
X

దిశ, ఆందోల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం సంబంధిత అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), బస్వాపూర్ పరిధిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఆయన పరిశీలించారు. బస్వాపూర్ పరిధిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని పరిశీలించిన ఆయన, భవనాన్ని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

త్వరలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. తర్వాత పుల్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పాఠశాల ఆవరణ, డార్మిటరీలు, తరగతి గదులు, స్టోర్‌రూమ్, వంటశాలను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఈగలు, దోమల నివారణకు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా పరిశుభ్రత పాటిస్తూ, ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలని తెలిపారు. విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా 6వ తరగతి విద్యార్థినులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, పాఠ్యాంశాలను చదివించి వారి అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని కలెక్టర్ ప్రతీక్ జైన్ విద్యార్థినులకు సూచించారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు, ఎంఈఓ, కేజీబీవీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story