ప్రశ్నాపత్రాల లీకేజీలతో యువత భవిష్యత్తుతో చెలగాటం

by Ratna Kumari |

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీకేజీలతో దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలతో యువత భవిష్యత్తుతో చెలగాటం
X

దిశ, రఘునాథపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీకేజీలతో దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శుక్రవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్‌లో సీపీఐ మండల కార్యదర్శి కావటి యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన జనగామ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనతో యువత తీవ్రంగా నష్టపోయిందని, దీనిపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, మతం పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యల కంటే పరస్పర విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఛ‌దేశంలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ అసమానతలపై యువత చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాడుతుందని అన్నారు. అనంతరం కుర్చపల్లి గ్రామానికి చెందిన పలువురు కూనంనేని సాంబశివరావు సమక్షంలో సీపీఐ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇట్టబోయిన ఉమామహేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆది సాయన్న, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పాతూరి సుగుణమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, మండల సహాయ కార్యదర్శి కందుకూరి మల్లేశం, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story