మందిపల్లి పాఠశాల వంట ఏజెన్సీకి షోకాజ్ నోటీసు

by Ratna Kumari |

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మందిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో నిర్దేశిత మెనూను పాటించకపోవడంపై జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు.

మందిపల్లి పాఠశాల వంట ఏజెన్సీకి షోకాజ్ నోటీసు
X

దిశ, ధన్వాడ : నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మందిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో నిర్దేశిత మెనూను పాటించకపోవడంపై జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆ రోజు మెనూ ప్రకారం వెజిటేబుల్ కర్రీ, సాంబారు వడ్డించాల్సి ఉండగా, వంట ఏజెన్సీ నిర్వాహకులు కేవలం సాంబారు మాత్రమే తయారు చేసినట్లు గుర్తించారు. వెజిటేబుల్ కర్రీ ఎందుకు తయారు చేయలేదని నిర్వాహకులను ప్రశ్నించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నిర్లక్ష్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసిన కలెక్టర్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వంట ఏజెన్సీ నిర్వాహకులకు వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్, వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. తదుపరి గ్రామంలో నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం ధన్వాడ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, రెవెన్యూ సేవలపై సమీక్ష నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి వారు ఏ పనిమీద వచ్చారో అడిగి తెలుసుకున్నారు. సర్టిఫికెట్ కోసం వచ్చిన ఓ మహిళతో మాట్లాడి, ప్రజలకు సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ సింధుజ, ఎంపీడీఓ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story