కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీ-కర్ణాటకకు శుభవార్త

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర మంత్రిమండలి (కేబినెట్) సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీ-కర్ణాటకకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర మంత్రిమండలి (కేబినెట్) సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

ఏపీ - కర్నాటక మధ్య కొత్త రైల్వే లైన్లు..

తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్నాటకకు ప్రయోజనం చేకూర్చేలా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బళ్లారి - గుంతకల్లు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రూ1,264 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ, కర్నాటక సరిహద్దుల్లోని దాదాపు 99 గ్రామాలకు మెరుగైన రైల్వే అనుసంధానం లభించనుంది. ఇందులో భాగంగా వేదవతి నదిపై భారీ రైల్వే వంతెన నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది.

రూ.3,030 కోట్లతో భవ్య రసాయన పథకం..

దేశంలో రసాయన పరిశ్రమల పురోగతికి ప్రత్యేక ప్రోత్సాహకాలను కేబినెట్ ప్రకటించింది. దేశంలో కెమికల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.3,030 కోట్లతో 'భవ్య రసాయన పథకానికి' ఆమోదం లభించింది. ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేసే ఒక్కో కెమికల్ పార్కుకు రూ.1,000 కోట్ల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

పేపర్ లీకైపై కఠిన చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్..

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారాన్ని అరికట్టేందుకు కేంద్రం తీవ్రంగా పరిగణించింది. పేపర్ లీక్ నిరోధక చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణల ప్రకారం, పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి లేదా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడే నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటారు. లీకేజీలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించే వెసులుబాటును ఈ కొత్త చట్టంలో కల్పించనున్నారు.

Next Story