- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంటగది లేక తరగతి గదిలోనే వంట.. మిగతా రెండిట్లోనే పాఠాలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం.. క్షేత్రస్థాయిలో అంతులేని దుస్థితిని ఎదుర్కొంటోంది.

దిశ, తాడ్వాయి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం.. క్షేత్రస్థాయిలో అంతులేని దుస్థితిని ఎదుర్కొంటోంది. ఎస్సీ వాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 58 మంది విద్యార్థులు అభ్యసిస్తుండగా.. పాఠశాలలో ఉన్న మొత్తం మూడు గదుల్లో సరైన వంటగది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఒక గది వంటగదిగా మార్పు.. ఇరుకు గదుల్లోనే చదువులు!
పాఠశాలలో వంటగది లేకపోవడంతో ఈ వర్షకాలంలో ఒక గదిని వంటగదిగా మార్చి, అందులోనే వంట సామాగ్రిని భద్రపరుస్తున్నారు.దీంతో మిగిలిన కేవలం రెండు గదుల్లోనే 58 మంది విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి వస్తోంది. ఇరుకు గదుల్లో విద్యార్థులు కిక్కిరిసి చదువుకోవడంతో పాటు, తరగతి గదిలోనే వంట చేస్తుండటంతో వచ్చే పొగ, ఉక్కబోత మధ్య చిన్నారులు అల్లాడిపోతున్నారు.
వర్షం వస్తే వంట బంద్... తరగతి గదే శరణ్యం!
పాఠశాలలో సరైన వంటగది లేకపోవడంతో వంట చేయాలంటేనే నిర్వాహకులు భయపడిపోతున్నారు. ఆకాశంలో చిన్న మబ్బు కనిపిస్తే చాలు, వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వర్షం కురిస్తే వేరే దారి లేక, చదువుకోవాల్సిన గుడిలాంటి బడిలో పొగలు కమ్ముకుంటూ వంట చేస్తుండటంతో విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
తాటిపత్రుల అడ్డుగా... ప్రచార ఆర్భాటాల నడుమ
ఎండకాలమైనా, వానకాలమైనా ఈ బడిలో వంట మాత్రం మూడు కట్టెలకు తాటిపత్రి అడ్డుగా పెడితేనే వంట కష్టం మీద పూర్తవుతుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న క్షేత్రస్థాయిలో ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. బియ్యం, ఇతర సామాగ్రిని భద్రపరిచేందుకు సరైన రక్షణ లేక ఎలుకల పాలవుతున్నాయి.
కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉన్నా... కదలని యంత్రాంగం
ఈ పాఠశాలలో నూతన వంటగది నిర్మాణానికి ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రొసీడింగ్స్ జారీ అయ్యి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వ నిధులు మంజూరైనా, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పటికి ఎవరికి అంతుపట్టడం లేదు.
కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్లే ఆలస్యం: ఎంఈఓ రామస్వామి
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వంటగది నిర్మాణానికి ప్రొసీడింగ్స్ వచ్చినప్పటికీ, పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకురావడంలో కొంత ఆలస్యం అయింది. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. త్వరలోనే అన్ని అడ్డంకులను తొలగించి, వంటగది నిర్మాణ పనులను వేగంగా ప్రారంభిస్తాం.






