అధికారులపై షాడో కౌన్సిలర్లు ఒత్తిళ్లు ఆపాలి.. బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణ

by Kodari Anjali |

మున్సిపాలిటీలో ప్రజలకు అవసరం లేని అంశాలను ఎజెండాలో చేర్చి, బిల్లుల ద్వారా జేబులు నింపుకునేందుకు అవకాశం ఇవ్వబోమని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు హెచ్చరించారు.

అధికారులపై షాడో కౌన్సిలర్లు ఒత్తిళ్లు ఆపాలి.. బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణ
X

దిశ, కామారెడ్డి: మున్సిపాలిటీలో ప్రజలకు అవసరం లేని అంశాలను ఎజెండాలో చేర్చి, బిల్లుల ద్వారా జేబులు నింపుకునేందుకు అవకాశం ఇవ్వబోమని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు హెచ్చరించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు విలేకరుల సమావేశం నిర్వహించి పలు ఆరోపణలు చేశారు.

ప్రజా అవసరాలకు తావు లేని ఎజెండా

గత ఐదు నెలలుగా ప్రజలకు అవసరమైన ఒక్క పని కూడా జరగలేదని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఆల్ పార్టీ మీటింగులో ప్రజలకు లబ్ది చేకూరేలా ఎజెండా పెట్టాలని, అత్యవసర బిల్లులకు ఆమోదం తెలుపుతామని చెప్పామని, అయినా ప్రజా అవసరాలకు సంబంధం లేని బిల్లులను ఎజెండాలో చేర్చారని మండిపడ్డారు. "ఇది స్కూల్ కాదు.. ఇష్టం వచ్చిన ఎజెండాలు పెట్టడానికి. చైర్మన్ మేడమ్ కాదు, చైర్మన్ సార్ అంటారు. ఆయనే మున్సిపల్‌లో ఉంటారా?" అని ప్రశ్నించారు.

రూ.13 కోట్ల బిల్లులపై అనుమానాలు

వార్డులకు రూ.5 లక్షల చొప్పున రూ.2.45 కోట్ల బిల్లులు పెట్టిన సమయంలోనే, జేబులు నింపుకోవడానికి రూ.13 కోట్ల బిల్లులు పెట్టారని ఆరోపించారు. ఆ బిల్లులపై లెక్కలు అడిగితే కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. గతంలో జేసీబీ కొనుగోలుకు తీర్మానం చేసినప్పటికీ, మళ్లీ జేసీబీ అద్దె కోసం రూ.30 లక్షలు, రూ.15.50 లక్షల బిల్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త జేసీబీ రూ.35 లక్షలకే వస్తుందని, కానీ దాని అద్దెకే రూ.45 లక్షల బిల్లు ఏమిటి? ఒక ఎజెండాను రెండుసార్లు రిజెక్ట్ చేసినా మూడోసారి అదే పెట్టడం సరికాదన్నారు.

వాహనాలు, డీజిల్ లెక్కలు లేవు

మున్సిపాలిటీలో చెత్త వాహనాలు 30 ఉంటే, 8 వాహనాలు డంపింగ్ యార్డు వద్దే ఉన్నాయని తెలిపారు. వాటి రిపేర్ కోసం రూ.9.45 లక్షలకు అప్రూవల్ ఇచ్చినా ఇప్పటివరకు చేయలేదని, అయినా ఆ వాహనాలకు డీజిల్ వాడినట్లు బిల్లులు రాస్తున్నారని ఆరోపించారు. గతంలో కంటే డీజిల్ వాడకం పెరిగిందని, ఎక్కడ డీజిల్ తెస్తున్నారో, ఏ వాహనాలకు వాడుతున్నారో అడిగితే సమాధానం ఇవ్వడం లేదని చెప్పారు.

షాడో కౌన్సిలర్ల ఒత్తిడి..

మున్సిపల్‌లో అధికారులను ఏది అడిగినా "చైర్మన్ సార్ కే తెలుసు" అంటున్నారని, ఆ "సార్" ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. పని చేసే అధికారులను బెదిరిస్తున్నారని, షాడో కౌన్సిలర్లు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. సమావేశం వాయిదాకు తాము కారణమని చెప్పడం సరికాదన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత అందరూ వచ్చాక క్యాన్సిల్ చేయాలని, అలా కాకుండా ఎవరూ రాకముందే వాయిదా అని చెప్పడం బాధ్యతారాహిత్యమని అన్నారు. "ప్రజల అభివృద్ధికి సంబంధించిన ఎజెండాకు మాత్రమే మేము సహకరిస్తాం. అప్పటివరకు దొంగ ఎజెండాలపై పోరాడుతూనే ఉంటాం" అని బీజేపీ కౌన్సిలర్లు స్పష్టం చేశారు.

Next Story