రూ. 8 లక్షల పెట్టుబడి పేరుతో మోసం

by Taduka Kalyani |

పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన జీబేక్స్ టెక్నో కార్ట్ ఎల్.ఎల్. పి సంస్థ సీఈఓ చిక్కాల రాజా రామ్ మోహన్ రాయలు పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.

రూ. 8 లక్షల పెట్టుబడి పేరుతో మోసం
X

దిశ, శేరిలింగంపల్లి : పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన జీబేక్స్ టెక్నో కార్ట్ ఎల్.ఎల్. పి సంస్థ సీఈఓ చిక్కాల రాజా రామ్ మోహన్ రాయలు పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. బాధితుడు శ్రీకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే ప్రతి రోజు వడ్డీ చెల్లిస్తామని మూడు నెలల్లో అసలు మొత్తంతో పాటు 30 శాతం లాభం వస్తుందని ఆశ చూపించి రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాడని కేపీహెచ్‌బీకి చెందిన వ్యాపారి చింతల శ్రీకర్‌ తెలిపారు. తన స్నేహితుడి ద్వారా GBEX Technokart LLP సీఈఓ చిక్కల రాజా రామ్ మోహన్ రాయలుతో పరిచయం ఏర్పడింది. పెట్టుబడి పెడితే రోజుకు రూ.2,280 చెల్లిస్తానని, మూడు నెలల్లో అసలు డబ్బు తిరిగి ఇస్తానని నమ్మించి పెట్టుబడి పెట్టేలా ప్రలోభ పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.నిందితుడు అమెరికన్ డిజిటల్ కరెన్సీ USDT (టెథర్)ను దుబాయ్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి, భారత్‌లోని బైనాన్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అధిక ధరకు విక్రయించడం ద్వారా భారీ లాభాలు వస్తాయని బాధితుడికి నమ్మించినట్లు తెలుస్తోంది.వ్యాపారం నష్టాల్లో ఉండటంతో తన బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపాడు. ప్రారంభంలో సుమారు 45 రోజుల పాటు రోజుకు రూ.2,280 చెల్లించిన చిక్కాల రాజా రామ్ మోహన్ రాయలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా మరికొంత సమయం కావాలని చెప్పి, మరిన్ని పెట్టుబడిదారులను తీసుకురావాలని ఒత్తిడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. ఇదే తరహా మోసాలకు సంబంధించి ఇప్పటికే ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ విషయమై బాధితుడు తొలుత కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించగా 15 రోజుల్లో డబ్బు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత ముఖం స్టార్ట్ చేయడంతో బాధితుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

Next Story