- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిధిలావస్థలో బీసీ బాలికల హాస్టల్.. ప్రభుత్వంపై మాజీ Deputy Cm ఫైర్
పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులకు నాణ్యమైన వసతి, భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ డిప్యూటీ సీఎం, నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు....

దిశ, కడప టౌన్: పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులకు నాణ్యమైన వసతి, భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ డిప్యూటీ సీఎం, నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. కడప నగరంలోని కోపరేటివ్ కాలనీలో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. శిధిలావస్థకు చేరుకున్న హాస్టల్ భవనాన్ని పరిశీలించి విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ, హాస్టల్ భవనం పూర్తిగా దెబ్బతిని ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతూ విద్యార్థినులకు గాయాలవుతున్నాయని, వర్షాకాలంలో ప్రమాదం మరింత పెరుగుతోందన్నారు. భయాందోళనల మధ్య విద్యార్థినులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు..జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితకు చెందిన బీసీ సంక్షేమ శాఖలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. హాస్టల్ సమస్యలపై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విద్యార్థినుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదని, ప్రమాదం జరిగేలోపు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సురక్షితమైన వసతి, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
శిధిలావస్థలో ఉన్న హాస్టల్‌ను వెంటనే సురక్షితమైన భవనానికి తరలించి, శాశ్వత భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే విద్యార్థినుల భద్రత దృష్ట్యా వారిని స్వయంగా బీసీ భవనానికి తరలించే కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమాలతో పాటు అన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో పోరాటం చేస్తామని అంజాద్ బాషా హెచ్చరించారు.






