ఎంతటి కరువైనా తట్టకునే మొక్క ఆయిల్​పామ్: మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో ఎలాంటి కఠిన పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగల సామర్థ్యం ఉన్న పంటల్లో ఆయిల్‌పామ్ ఒకటని, దానిని సాగు విస్తరణను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఎంతటి కరువైనా తట్టకునే మొక్క ఆయిల్​పామ్: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎలాంటి కఠిన పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగల సామర్థ్యం ఉన్న పంటల్లో ఆయిల్‌పామ్ ఒకటని, దానిని సాగు విస్తరణను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోందని, ఆయిల్‌పామ్ తాజా గెలలకు మార్కెట్లో మంచి ధర లభిస్తోందన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గుచూపుతున్నారని, ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునేలా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. రైతులు నర్సరీలకు వెళ్లినప్పుడు మొక్కలు అందుబాటులో లేవని చెప్పే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని, రైతుల అవసరాలను ముందుగానే అంచనా వేసి, అవసరమైన మేరకు నాణ్యమైన పామాయిల్ మొక్కలను నర్సరీలలో సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో, ప్రతి ఆయిల్‌పామ్ విస్తరణ ప్రాంతంలో రైతుల డిమాండ్‌కు అనుగుణంగా మొక్కల ఉత్పత్తి చేపట్టాలని సూచించారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఎత్తు పెరిగే, తక్కువ నిడివి గల ఆకులు కలిగి, అధిక దిగుబడులు ఇచ్చే మొలకలను దిగుమతి చేసుకోవాలని సూచించారు. ఈ రకాల మొక్కలు రైతులకు నిర్వహణ సులభతరం చేయడమే కాకుండా అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని అందిస్తాయని తెలిపారు. అదేవిధంగా ఆయిల్‌పామ్ సాగులో కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ విషయంలో కూడా ఎలాంటి జాప్యం ఉండకూడదన్నారు. డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు సకాలంలో పరికరాలు అందేలా డ్రిప్ కంపెనీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని, ఒకే చోట అవసరమైన సేవలు అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ విస్తరణ కార్యక్రమాన్ని కేవలం లక్ష్యాల సాధనగా కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచే ఉద్యమంగా అధికారులు భావించాలని పేర్కొన్నారు. నర్సరీల నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రతి దశలో నాణ్యత, పారదర్శకత, వేగం ఉండాలని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని పేర్కొన్నారు.

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు గడువులోగా పూర్తిచేయాలి :

ఖమ్మం జిల్లా కల్లూరు గూడెంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సంబంధించిన మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కూడా వేగవంతం చేయాలన్నారు. విజయ హైదరాబాద్ బ్రాండ్ వంటనూనెల విక్రయాలను పెంపొందించే దిశగా మార్కెట్ విస్తరణ, విస్తృత ప్రచార కార్యక్రమాలు, విక్రయ ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారానే అమ్మకాలు, కొనుగోలు నిర్వహించాలని, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినేస్ వారితో సంప్రదించి మార్కెటింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని తెలిపారు.

Next Story